‘ఉప్పెన’ సుందరి మీద మనసు పారేసుకోని వారంటూ లేరు. అసలు కరోనా రాకుంటే ఆమె ఎక్కడో ఉండేది. ఆమె పాలిట కరోనా ఓ శాపమైంది. అయినా ఆమెకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. సొట్ట బుగ్గలు, కళ్ల తోనే హావభావాలు పలికించడంలో కృతి శెట్టి స్టయిలే వేరు. ఇప్పుడామె హీరో సుధీర్ బాబుకు జోడీగా రాబోతోంది. తెలుగు తెరపై యువ కథానాయకులు తమదైన దూకుడు చూపుతూ వస్తున్నారు. అయితే సుధీర్ బాబు మాత్రం, తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు.
ఇటీవల ఆయన నుంచి ‘వి’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో తనకి ‘సమ్మోహనం’ సినిమాతో హిట్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన ‘వి’ సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు గానీ, సుధీర్ బాబు చేసిన పాత్ర నటన పరంగా మంచి మార్కులను తెచ్చిపెట్టింది. మళ్లీ ఆయన అదే దర్శకుడితో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘దీపావళి’ సందర్బంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ డ్రామా చేయబోతున్నానని ఆయన చెప్పాడు. ఇంద్రగంటి మోహనకృష్ణతో సుధీర్ బాబుకి ఇది మూడో సినిమా అయితే, కెరియర్ పరంగా ఇది ఆయనకి 14వ సినిమా. ఈ సినిమాలో తన జోడీగా ‘కృతి శెట్టి’ చేయనుందని సుధీర్ బాబు స్పష్టం చేశాడు. ‘కృతి శెట్టి’ తెలుగులో తన మొదటి చిత్రంగా ‘ఉప్పెన’ చేసింది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలలో ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన పోస్టర్స్ తో .. లిరికల్ వీడియోస్ తో కృతి శెట్టి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. చురకత్తుల్లాంటి చూపులతో .. సొట్టబుగ్గలతో విసిరే కొంటె నవ్వులతో సమ్మోహితులను చేస్తోంది. ఈ మధ్య కాలంలో తెరపై పండుగలా కనిపించిన ఫేస్ ఇదేననే టాక్ యూత్ లో వినిపిస్తోంది. ఇక తెలుగులో ఈ అమ్మాయి బిజీ కావడం ఖాయమనే మాట ఇండస్ట్రీలోను షికారు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు కొత్త సినిమాకి ఈ అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
AlsoRead ;- మోకాలి నొప్పిని ‘వి’శ్వాసంతో తగ్గించుకున్న సుధీర్