ఇండస్ట్రీలో నెపోటిజం అనే పదం తరచుగా వినిపిస్తూన్నప్పటికీ.. నట వారసుల ఎంట్రీ మాత్రం ఆగడంలేదు. ఇప్పటికే కొణిదెల , నందమూరి, అక్కినేని, అల్లు, మంచు, మేకా, పూడిపెద్ది (సాయికుమార్) వారి ఫ్యామిలీస్ నుంచి నటవారసులు వెండితెరమీద సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కొత్తగా మరో వారసుడు తెరమీదకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడి పేరు రోషన్ కార్తిక్. ఈ కుర్రోడు మరెవరో కాదు రాజీవ్ కనకాల, సుమల తనయుడు.
నిజానికి కనకాల వారి కుటుంబం.. టాలీవుడ్ లో ఎందరో నటీనటులు ప్రవేశించడానికి చాలా దోహదపడింది. దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల దంపతులు హైద్రాబాద్ లో ఫిల్మ్ ఇన్స్ స్టిట్యూట్ స్థాపించి ఎందరికో శిక్షణనిచ్చి.. తెలుగు సినిమాల్లో అవకాశాలు కల్పించారు. వారి పిల్లలు రాజీవ్ కనకాల, శ్రీలక్ష్మీ కనకాల కూడా నటీనటులన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి వారసుడు రోషన్ కార్తిక్ కూడా వెండితెరమీద ఎంట్రీ ఇవ్వడం టాలీవుడ్ లో విశేషంగా మారింది.
రోషన్ కార్తిక్ కనకాల ఇంతకు ముందు శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ మూవీలో ముఖ్యపాత్ర పోషించి మెప్పించాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు రోషన్ హీరోగా సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించే సినిమాతో రోషన్ కార్తిక్ హీరోగా పరిచయం కాబోతున్నాడట. మరో నిర్మాత తో కలిసి సుమ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట. మరి రోషన్ కార్తిక్ హీరోగా ఎలా రాణిస్తాడో చూడాలి.