మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పాత్ర దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిదే నని, హత్యకు ప్లాన్ చేసింది, సాక్ష్యాలను ధ్వంసం చేసిందీ ఆయనేనని, ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దంటూ వివేకా కుమార్తె సునీత హై కోర్టును కోరారు. దిగువ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు ఆయనకు బెయిలు ఇవ్వొద్దని, ఆయనకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సునీత తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు తెలిపారు.ఈ క్రమంలో ఆయన పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
తన తండ్రి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని అప్పటి డీజీపీని సునీత కలిసి కోరారని, దానికి ఆయన స్పందిస్తూ.. శివశంకర్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తనకు రెండు కళ్లు లాంటి వారని సీఎం జగన్ తనకు చెప్పినట్టు డీజీపీ ఆమెకు వివరించారని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.సునీత ఇదే విషయాన్ని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ పేర్కొన్నా విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేవిరెడ్డి ప్రస్తుతం వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, అధికారులంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల సహకారం లేకుండా దర్యాప్తు తుది దశకు చేరుకోదని, కాబట్టి ఆయనకు బెయిలు ఇవ్వొద్దని సునీత తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
ఇక దేవిరెడ్డి తరపు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దస్తగిరి వాంగ్మూలం తప్ప ఈ హత్య ఘటనలో దేవిరెడ్డి పాత్ర ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఆరున్నర నెలలుగా ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారని, సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిలుకు దేవిరెడ్డి అర్హుడని అన్నారు. ఒకవేళ ఏపీలో కాకుంటే మరే రాష్ట్రంలోనైనా ఉండేలా షరతు విధించి బెయిలు ఇవ్వాలని కోరారు. సునీత, దేవిరెడ్డి తరపు వాదనలు ముగియడంతో ఇతర నిందితుల వాదనలు జరగాల్సి ఉంది.
కాగా, ఇతర నిందితుల వాదనలు ఈరోజు జరగనున్నాయి.ఆ వాదనల ఆనంతరమే దేవిరెడ్డి బెయిల్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశాం ఉన్నట్లుగా తెలుస్తోంది.