‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా?’ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ డైలాగును సార్థకం చేసుకుంటున్నాడు.
తెలుగు హీరోల్లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న హీరోల్లో మహేష్ బాబుదే పైచేయి అనటంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో మహేశ్ ‘దూకుడు’ మామూలుగా లేదు. ఒకప్పుడు హీరోల గురించి మాట్లాడాల్సి వస్తే అభిమానుల గురించి, అభిమాన సంఘాల గురించి మాట్లాడేవారు. ఎవరికి ఎక్కువ అభిమానులు ఉంటే వారే తోపు అనేవారు. ఇప్పుడా ఊపు లేదుగానీ.. సోషల్ మీడియా తోపులు మాత్రం చాలామందే ఉన్నారు.
సోషల్ మీడియా గురించి మనం మాట్లాడాల్సి వస్తే అందులో అగ్రస్థానంలో ఉన్నది ట్విట్టరే. ఆ తర్వాత స్థానంలో ఇన్ స్టాగ్రామ్ ఉంటుంది. ప్రముఖులంతా ఎక్కువగా ట్విట్టర్ లోనే ఉంటుంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీరి స్టార్ డమ్ ను ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలే నిర్దేశిస్తున్నాయి. మన తెలుగు నటుల్లో 10 మిలియన్లకు మించి ఫాలోవర్లు ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క మహేష్ బాబేనని చెప్పాలి.
2010లో ట్విట్టర్ లో చేరిన మహేష్ బాబుకు ఇప్పుడు 10.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో అక్కినేని నాగార్జున, దగ్గుబాటి రానా ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లోకి మహేష్ బాబు ఆలస్యంగా చేరారు. 2018 లో ఇన్ స్టాగ్రామ్ లో చేరినా అతి తక్కువ సమయంలో 6 మిలియన్ల మంది ఫాలోవర్లను సాధించుకోగలిగారు. మరో విషయం ఏమిటంటే ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా మహేశ్ ఈ సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందిస్తారు. తన అభిప్రాయాలను అందరితో పంచుకోడానికే ప్రాధాన్యం ఇస్తాడు. మిగిలిన సోషల్ మీడియా స్టార్స్ ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్
సీనియర్ నటుడు సోషల్ మీడియా మీద దృష్టిపెట్టడం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా దీని మీద అంతగా దృష్టిపెట్టలేదు. ఈ ఏడాది మార్చిలో ఆయన ట్విట్టర్ లో చేరారు. తక్కువ కాలంలోనే 818. 1 k ఫాలోవర్లను సాధించుకోగలిగారు. ఈ మధ్య ట్విట్టర్ లో చిరు చాలా చురుకుగా ఉన్నారు. ముఖ్యంగా కరోనా కాలాన్ని ట్విట్టర్ ద్వారా సద్వినియోగం చేసుకున్నవారెవరైనా ఉన్నారా అంటే అది చిరంజీవేనని చెప్పాలి. విక్టీర వెంకటేష్ 2019లో ట్విట్టర్ లోకి వచ్చి 310. 2k మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అప్పుడప్పుడు మినహా ఇందులో వెంకీ పెద్దగా యాక్టివ్ గా ఉన్నది లేదు.
పవన్ కళ్యాణ్, ప్రభాస్
హీరో, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చురుకుగా ఉంటారు. ఆయనకు 4.1 మిలియన్ ఫాలోవర్లు ట్విట్టర్ లో ఉన్నారు. సినిమాలకన్నా పార్టీల విషయాల మీదే ఆయన ఇందులో ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. 2014 ఆగస్టు నుంచి ఆయన ట్విట్టర్ లో ఉన్నారు. ఇక ఇన్ స్టా గ్రామ్ విషయానికి వస్తే ఇందులో ఆయన అంత యాక్టివ్ గా ఉండరు. రాజకీయ ఆదరణ ఎక్కువగా ఉండటంతో ఆయన ట్విట్లలకు మంచి స్పందన లభిస్తుంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చాలా ఆలస్యంగా సోషల్ మీడియా మీద దృష్టి పెట్టారు. 2019 లో ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. బాహుబలికి సంబంధించిన ఫోటోను మొదటి పోస్ట్ చేసి అందరి దృష్టిలోనూ పడ్డారు. ఇందులో ఆయనకు 5.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ
అల్లు అర్జున్ డ్యాన్సుల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ స్పీడ్ ఎక్కువే. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ విషయంలో అల్లు అర్జున్ కు బ్రేక్ వేశాడనే చెప్పాలి. ఇన్ స్టాలో అగ్రస్థానంలో విజయ్ దేవరకొండ ఉంటే, రెండో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. విజయ్ దేవరకొండకు 9.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మలయాళంలోనూ భారీ అభిమానులను సంపాదించుకున్న హీరో ఈ స్టయిలిష్ స్టారే. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ కు 8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
2015లో అల్లు అర్జున్ ట్విట్టర్ లో చేరారు. ఇక్కడ 5.4 మిలియన్ల ఫాలోవర్లు బన్నీకి ఉన్నారు. ట్విట్టర్ లో చాలా చురుకుగా ఉంటారు. విజయ్ దేవరకొండకు మాత్రం ట్విట్టర్ లో 1.9 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. 2016లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండకు యూత్ లో క్రేజ్ ఏర్పడింది. ఆయన ఇన్ స్టాలో చురుకుగా ఉంటారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా ఆయన క్రేజ్ ను మరింత పెంచింది. 8 మిలియన్ల మంది ఫాలోవర్లను దాటిన మొదటి దక్షిణ భారత నటుడిగానూ విజయ్ ఓ రికార్డ్ సాధించారు.
అక్కినేని నాగార్జున, దగ్గుబాటి రానా
ట్విట్టర్ లో 6.1 మిలియన్ ఫాలోవర్లతో నాగార్జున, రానా తర్వాతి స్థానంలో ఉన్నారు. రానా 2010లోనే ట్విట్టర్ లో చేరారు. ఆయన లీడర్ సినిమాతో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 2015లో బాహుబలితో రానా క్రేజ్ అమాంతం పెరిగింది. అంతకు ముందు 2011లో ‘దమ్ మారో దమ్’తో బిపాసా బసుతో నటించారు.
ఆ సినిమా పరాజయం పాలైనా ట్విట్టర్ లో రానా క్రేజ్ మాత్రం తగ్గలేదు. అక్కినేని నాగార్జున సీనియర్ హీరో. 1980లో హీరోగా రంగ ప్రవేశం చేశారు. సాధారణంగా సీనియర్ హీరోలు సోషల్ మీడియా మీద అంత ఆసక్తి చూపేవారు కాదు. కానీ నాగార్జునకు ముందు చూపు ఎక్కువ. అందుకే ట్విట్టర్ లో ముందే చేరిపోయి ఫాలోవర్లను పెంచుకున్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్
ఒకప్పటి మహానటుడిగా వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 2009లో ట్విట్టర్ లో చేరారు. ఇందులో ఆయనకు 4.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎన్టీఆర్ కన్నా ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో చురుకుగా ఉంటారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్ కోసం ఫాలో అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ట్విట్టర్ లో చురుకుగా ఉంటారు. ఒక మిలియన్ ఫాలోవర్లు రామ్ చరణ్ కు ఉన్నారు. అయితే నాన్న చిరంజీవిలాగే ఆయనతో పాటే ఇందులోకి ఇటీవలే వచ్చారు. ఇన్ స్టాలో మాత్రం 3.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
నాచురల్ గానే నాని స్టార్
నాచురల్ స్టార్ నాని ఫిబ్రవరి 2012 లో ట్విట్టర్‌లో చేరారు. ఇప్పుడు 3.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తుంది. నానీకి ఫాలోవర్లు పెరగడానికి కారణం అతని జర్సీ సినిమా కూడా ఓ కారణం అనుకోవచ్చు. ఇది హిందీలో రేమేక్ అవుతోంది. హీరోలతో పాటు ఆయా హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తుంటారు.
సినిమా అప్ డేట్స్ కూడా ఈ సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెలుగులోకి వస్తున్నాయి. ఇది వరకు ఇలాంటి అప్ డేట్స్ కోసం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాల్సి వస్తోంది. ఇప్పుడు ఇలా ట్విట్టర్ లోనో, ఇన్ స్టా గ్రామ్ లోనో అప్ డేట్ వచ్చిందంటే చాలు వాటి ఆధారంగా పత్రికల్లో, టీవీల్లో, వెబ్ సైట్లలో కథనాలు వచ్చేస్తున్నాయి. కాలం తెచ్చిన మార్పు మహిమ మరి.
– హేమసుందర్ పామర్తి