ఏ హీరో గురించి అయినా చెప్పాల్సి వస్తే అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారు చెబితేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరి పరిశీలనా శక్తి ఒక్కోలా ఉంటుంది. ఒక హీరో గురించి ఒక రచయిత చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆ హరో మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ.. ఇక ఆ రచయిత సత్యానంద్.
దాదాపు 400 చిత్రాల రచయితగా సత్యానంద్ గురించి చెప్పేదేముంటుంది. సత్యానంద్ తొలి ప్రయాణం హీరో కృష్ణ సినిమా తోనే. అదే 1973లోని ‘మాయదారి మల్లిగాడు’ నుంచి. మద్రాస్ శివాజీ గార్డెన్స్ లో పాటతో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన రోజది. ఓ చెట్టు కింద చైర్ లో కూర్చుని పాటకి చివర్లో వచ్చే సీన్ లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చెప్పిన కరెక్షన్స్ చేస్తున్నారు డైలాగ్ రైటర్ -అసిస్టెంట్ డైరెక్టర్ అయిన సత్యానంద్. ఇంతలో ఎవరో వచ్చి పక్క చైర్లో కూర్చుంటూ ‘పిక్చర్ లో డైలాగులు బావున్నాయని అంతా అంటున్నారట.. మేకప్ మాధవ రావు చెప్పాడు’ అన్న మాటలు వినపడ్డాయి. అడిగిన వ్యక్తే హీరో కృష్ణ. అదే వారి మొదటి పరిచయం.
‘సీన్ ఓసారి మీరు చదివితే వింటా’వినయంగా అడిగారు కృష్ణ. అలాంటి అవకాశం వస్తే ఎవరైనా రెచ్చిపోతారు కదా.. సత్యానంద్ కూడా అలాగే చేశారు. ‘బావుంది’ అన్న ప్రశంసతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు. అసలు ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి రంగుల్లోకి రావడానికి కారణం కృష్ణ. అప్పటికే ఒకరోజు షూటింగ్ చేసేశారు. రెండో రోజు
షూటింగ్ లో డైరెక్టర్ ఆదుర్తి తో కృష్ణ ‘మీ స్వంత సినిమా బ్లాక్ అండ్ వైట్ లో తీస్తున్నారేంటి డైరెక్టర్ గారూ?’ అనడిగారు.
‘మన రెండు హిందీ సినిమాలు ‘జీత్’ ‘దర్పణ్’ దెబ్బతిన్నాయిగా.. ఫైనాన్సియల్ సమస్యలతో …’ అంటుండగా మధ్యలోనే అందుకున్నారు కృష్ణ ‘అదేంటి డైరెక్టరుగారూ.. మా లాంటి కొత్తమొహాలతో ఏళ్ళ క్రితమే కలర్ సినిమా తీసిన మీరు బ్లాక్ అండ్ వైట్ ఏంటి? రెండు రోజుల షూట్ చేసింది పక్కన పడేసి కలర్ లో తీద్దాం’ అన్నారు.
‘అది కాదు కృష్ణా పరిస్థితులు ..’ అంటుండగా ‘మీరలా ఉండండి.. నేను చూసుకుంటాగా’ భరోసా ఇచ్చారు. గంటలో కలర్ నెగిటివ్ వచ్చేసింది. పాత రష్ పక్కన పడేసి కొత్తగా మళ్లీ షూటింగ్ చేశారు. తనని పరిచయం చేసిన గురువు మీద కృష్ణకు ఉన్న ఇష్టం, కృతజ్ఞత అది అంటారు సత్యానంద్.
ఆ సినిమా రంగుల్లో రావడానికి కారణం కృష్ణేనంటారు. ఆ తర్వాత ‘ గాజుల కిష్టయ్య ‘ దర్శకుడు ఆదుర్తే కాబట్టి మరోసారి రచయితగా పనిచేసే అవకాశం వరించింది. అది సాన్నిహిత్యంగా మారి కలిసి సిగరెట్స్ కాల్చుకునే దాకా వెళ్లింది. అలా ఓరోజు ఇద్దరు సిగరెట్ కాలుస్తూ మాట్లాడుకుంటుంటే సడన్ గా ఆదుర్తి గారు అక్కడికి వచ్చారట. వెంటనే సిగరెట్ అవతల పారేసి లేచి నిల్చున్నారట కృష్ణ. అది ఆయనలోని వినయవిధేయతలు. కృష్ణ అనేవ్యక్తి పద్మాలయా బ్యానర్ తో వ్యవస్థగా మారారు. ‘ఫలానా నిర్మాత సగం రెమ్యూని రేషన్ బాకీ.. డబ్బింగ్ ఆపేద్దామా సార్’ అని మేనేజర్ అంటే ‘డబ్బింగ్ కాదు.. సినిమా కూడా ఆగడానికి వీల్లేదు ..’ కరాఖండీగా చెప్పేవారు కృష్ణ.
డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి సినిమా రిలీజ్ చేయించి నిర్మాతలను బతికించేవారు. అది ఆయనలోని మంచితనం అంటారు సత్యానంద్. అలా ఒకటి కాదు ఎన్నోసినిమాలు ఉన్నాయంటారు. కొత్త దర్శకులకు అండ, టెక్నిషియన్స్ కి ఊపిరి, కొత్తగా చెయ్యాలనే తపన.. అలా ముందుకు నడవబట్టే సూపర్ స్టార్ అయ్యారంటారు. ‘కౌ బోయ్ తియ్యకు.. చూడరు’ అని ఎవరైనా అంటే తీసి చూపిస్తారు. ‘సీతారామరాజు రిస్క్’ అంటే అదే తీసి రికార్డులు సృష్టిస్తారు. ‘సెవెన్టీ ఎంఎం తెలుగులో వేస్ట్’ అంటే దానికే సింహాసనం వేస్తారు.
దేవదాసు -కురుక్షేత్రం.. అనుకున్నట్టు కుదరక పోయినా అదరరు.. బెదరరు. అందుకే ఆయన డాషింగ్, డేరింగ్ హీరో అయ్యారంటారు. చేసిన సాయం.. ఇచ్చిన మాట మరవని వ్యక్తి కృష్ణేనంటారాయన. ‘మన సినిమా చాలా బావుంది కృష్ణ గారూ .. హిట్ టాక్ వచ్చింది ..’ అని ముఖస్తుతి కోసం ఎవరైనా అంటే ‘ఎవరు చెప్పారు మీకు .. ఈ సినిమా ప్లాప్ .. రిపోర్ట్స్ తెప్పించా కదా .. వారం లో లేపేస్తారు ..’ అని నిర్మొహమాటంగా చెప్పేస్తారట.
‘సక్సెస్’ ని మాత్రమే నెత్తిన పెట్టుకునే ఈ సినిమా ఇండీస్ట్రీ లో ఓటమిని కూడా గెలుపు లాగే ఓపెన్ గా నవ్వుతూ ఒప్పుకుని, చెప్పుకునే కృష్ణ లాంటి మనిషిని తను ఇంతవరకు చూడలేదంటారు. పొగరుబోతు గుర్రం లాంటి జీవితాన్ని లొంగదీసి గమ్యం వైపు వెళ్లే వారే విజేత. అలాంటివారిలో ఈ ‘బుర్రిపాలెం బుల్లోడు’కూడా ఉంటారంటూ సత్యానంద్ సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న అనుబంధాన్నిపంచుకున్నారు.
-హేమసుందర్ పామర్తి
Must Read ;- శ్రీమతికి కేకు తినిపించిన సూపర్ స్టార్ కృష్ణ











