సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ఏపీ సీఎం జగన్ కూడా కృష్ణకు నివాళులర్పించేందుకు రానున్నారు. ప్రస్తుతం ఆయన పార్ధివ దేహాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసంలో వీఐపీల సందర్శనార్ధం ఉంచారు.
ఈ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నానక్ రామ్ గూడా వెళ్లి కృష్ణ పార్థివ దేహం వద్ద నివాళులర్పించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తదితర ప్రముఖులంతా నానక్ రామ్ గూడ తరలి వచ్చి నివాళులర్పించారు. మాటలకు అందని విషాదం ఇదని చిరంజీవి వ్యాఖ్యానించారు. ‘సూపర్ స్టార్ కృష్ణ మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ ’ అని పేర్కొన్నారు. మరి కాసేపట్లో కృష్ణ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. కృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించనున్నారు. కృష్ణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపాన్ని ప్రకటించారు.
వెన్నెలైనా..! చీకటైనా..
రణ రంగంలో ఇద్దరు పోరాడితే అది యుద్ధం.. కురుక్షేత్రంలో రెండు సమూహాలు తలపడితే అది పోరాటం.. అడవిలో యుద్ధ నీతికి అతీతంగా రెండు సింహాలు కలబడితే అది భీకర పోరు.. ఈ పోరాటాల అంతిమ లక్ష్యం ఒక్కటే..! సాహసం.. ఆధిపత్యం.. నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణ సినీ, రాజకీయ మజిలీ కూడా ఇలాంటి సాహసోపేత ప్రస్థానమే..! సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి కష్టాన్నే నమ్ముకొని సినీ వినీలాకాశంలో ధ్రువతరగా నిలదొక్కుకున్నారు కృష్ణ. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా కృష్ణ చూపిన తెగింపు నా భూతో న భవిష్యతి.. సినిమాలను వినోదం పంచడం కోసమే కాకుండా, సమాజంలో మార్పు కోసం, వాస్తవాలను ప్రజలకు ఆవిష్కరించే క్రమంలో సినిమాల ఇతి వృత్తాన్ని సాహసోపేతంగా తెరకెక్కించడంలో కృష్ణ ఆయనకు ఆయనే సాటి.. ఆయనకు ఆయనే పోటీ..!! తనతో సినిమా నిర్మించి నష్టపోయిన నిర్మాతలకు రెండో అవకాశం ఇస్తూ చివరి వరకూ ప్రోత్సహించిన ఏకైక కథానాయకుడు కృష్ణ. వెన్నెలైనా చీకటైనా అని అన్నా, ఆకాశంలో ఒక తార అని పాడినా, అగ్నిపర్వతంలా పేలిపోయినా చెక్కు చెదరని ఆదరణ సినీ ప్రేమికుల నుండి పొందగలిగారు.