కొవిడ్ -19 బారిన పడిన చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయన్న విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్న లెక్కలు తక్కువగా చూపుతున్నారనే అనుమానాలకు బలాన్నిచ్చేలా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కొవిడ్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు కనీప పరిహారం రూ.4లక్షలు కూడా ఇవ్వలేమని గతంలో కేంద్రం ప్రకటించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. కొవిడ్ -19 కారణంగా చాలా కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చతికిలపడ్డాయి. పెద్దదిక్కును, ఇంటి ఆధారాన్ని కోల్పోయాయి. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలో రెండు మూడు మరణాలూ సంభవించాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం పరిహారం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంపై విమర్శలూ వ్యక్తమయ్యాయి. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
NDMAపై ప్రశ్నల వర్షం..
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కొవిడ్-19 వైరస్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు కనీస పరిహారం ఇవ్వడం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ-NDMA) రాజ్యాంగ విధి అని ఆదేశాలు జారీ చేసింది. పరిహారం ఎంత, ఎలా చెల్లిస్తారు అనే అంశాలపై ఆరు వారాల్లో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం బుధవారం వెలువరించిన తీర్పుల్లో NDMAపై ప్రశ్నల వర్షం కురిపించింది. కొవిడ్ మరణాలపై, కొవిడ్ చికిత్స విషయంలో స్పష్టత ఇవ్వకపోవడమే కాకుండా కొవిడ్ మరణాలకు పరిహారం విషయంలో కనీస విదుల్లోనూ విఫలమైందని వ్యాఖ్యానించింది. జాతీయ విపత్తుల చట్టంలోని పదాలకు వేరే అర్థాన్ని ఎలా తీసుకుంటారని, అలా చేస్తే ఆ చట్టం చేయడంలోని ఉద్దేశమే దెబ్బ తింటుందని పేర్కొంది. కొవిడ్ మృతులకు మరణ ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేయాలని ఆదేశించింది. చనిపోయిన తేదీ, మరణానికి కారణాలను అందులో పేర్కొనాలని, బాధిత కుటుంబం సంతృప్తి చెందకుంటే డెత్ సర్టిఫికెట్ను సవరించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. కొవిడ్ మరణాలకు సంబంధించి ఆ కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాలని న్యాయవాదులు గౌరవ్ కుమార్ బన్సల్, రీపక్ కన్సల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..
కేంద్రం తన వాదనలు వినిపిస్తూ కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించడం సాధ్యం కాదని గతంలో అఫిడవిట్లో పేర్కొంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడం, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అదనపు అఫిడవిట్ జత చేసింది. జాతీయ విపత్తు నిధి (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిధి (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ సంచిత నిధి (రిజర్వ్ ఫండ్) నుంచి ఇప్పటికే నిధులు వినియోగిస్తున్నామని, వైద్య సిబ్బందికి బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపింది. అదే సమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రకృతి వైఫరీత్యాల చట్టం -2005 ప్రకారం 12 జాతీయ స్థాయి విపత్తులను గుర్తించామని, తుపాన్లు, కరవు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, సునామీ, వడగండ్ల వాన, కొండచరియలు కూలడం, మంచుచరియల నుంచి ముప్పు, కుంభవృష్టి, కీటక దాడులు, వేడి/శీతల గాలులు ఆ జాబితాలో ఉన్నాయని చెప్పింది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పరిహారం ఇస్తున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదని కూడా కేంద్రం వాదించింది. అయితే ఈ వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. కోవిడ్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందేనని, అంత్యక్రియలు చేసే సిబ్బంది, శ్మశాన వాటికల సిబ్బంది లేదా ఇలాంటి సేవలందించే వారికి తక్షణం బీమా సౌకర్యం కల్పించాలని చెప్పడంతో పాటు మరికొన్ని ఆదేశాలు జారీ చేసింది.
అంకెల గారఢీ..
కాగా దేశంలోని పలు రాష్ట్రాలు కొవిడ్ మరణాలను దాస్తున్నాయన్న అనుమనాలున్నాయి. కొన్నిచోట్ల వీడియోలు బయటకు రాగా కొన్ని చోట్ల ఆ అనుమానాలకు బలాన్నిచ్చేలా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ విషయానికి వస్తే 3,669 కరోనా మరణాలే నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా సమాచార హక్కు ప్రకారం గత నెలలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్ మరణాలు 3,272 జరిగాయని అధికారికి లెక్కలుండగా, అదే కాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో 32,752 డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తేలింది. ఓ స్వచ్ఛంద సంస్థ సమాచార హక్కు ద్వారా ఈ వివరాలు సేకరించింది. 2020 ఏప్రిల్ నుంచి 2021 మే వరకు అంటే 13నెలల వ్యవధిలోనే 32,752 పత్రాలు జారీ అయినట్టు తేలింది. అదే సమయంలో హిందూ పత్రిక కొల్కత, చెన్నైల్లో జారీ అయిన మరణ ధ్రువపత్రాల సంఖ్యను పరిశీలిస్తే అంతకు ముందు కాలంతో పోల్చితే ఈ నగరాల్లో మరణాలు వరుసగా 4.5, 3.3 రెట్లు పెరిగాయని కథనంలో రాసింది. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. కోవిడ్ మరణాలు తెలంగాణలో 50 వేలు దాటి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తూ బీబీసీ కూడా క్షేత్రస్థాయి పరిశీలన కథనాన్ని వెలువరించింది.
ఏపీ విషయంలోనూ..
ఇక ఏపీ విషయంలోనూ అదే అనుమానాలను బీబీసీ పరిశోధన వ్యక్తం చేస్తోంది. ఏపీలో కేంద్రం వద్ద జాతీయ జనన మరణాల లెక్కల 2019 మే నెలలో 30, 266 మంది మాత్రమే మృతులుండగా 2020 మే లో 29, 980గా ఉంది. అంటే సగటున దాదాపు 30వేలుగా భావించవచ్చు. అయితే 2021 మే లో ఆంధ్ర ప్రదేశ్లో చనిపోయిన వారి సంఖ్య 86,757గా నమోదైందని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కరోనా మరణాలు కేవలం 2,938 మాత్రమేనని కథనంలో పేర్కొంది. 2019 ఆగస్టులో 28,713 మరణించినట్టు రికార్డుల్లో ఉండగా సగటు 30వేలు ఉంటుందని, అయితే 2020 ఆగస్టులో రాష్ట్రంలో నమోదైన మరణాలు 52, 447గా నమదైందని, గతంలో కంటే రెండింతలు ఎక్కువగా మరణాలు నమోదయ్యాయని తేల్చింది. ఈ లెక్కలను చూస్తే దేశ వ్యాప్తంగా ఇలాంటి లెక్కలే చాలా రాష్ట్రాలు చెబుతున్నట్లు అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. కాగా భారత్లో ఇప్పటి వరకు 3.9 కోట్ల మంది కొవిడ్ బారిన పడగా 2.9 కోట్ల మంది కోలుకున్నారని, 3.99లక్షల మంది చనిపోయినట్టు కేంద్రం అధికారికంగా చెబుతోంది. ఈ లెక్కలు చూసినా పరిహారంగా రూ.16వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అమలవుతున్న ప్యాకేజీలు, కేంద్రం ఇస్తున్న వరాలను లెక్కలోకి తీసుకుంటే కొవిడ్ వల్ల చనిపోయినవారి కుటుంబాల కోసం రూ.16వేల కోట్లు కేటాయించడం భారమే అయినా అసాధ్యం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Must Read ;- కొవిడ్ బెడ్స్ ఖాళీ.. సాధారణ సేవలు షురూ..!