Suresh Babu About Rana :
టాలీవుడ్ నిర్మాతలలో రామానాయుడు స్థానం ప్రత్యేకం. ఆయన అలవాట్లు .. అభిప్రాయాలు .. నిర్ణయాలు ఆయనను ఆ స్థాయికి చేర్చాయని చెబుతుంటారు. ఒక నిర్మాతగా ఆఫీసు వరకు మాత్రమే పరిమితం కాకుండా, లొకేషన్లకు కూడా వెళుతూ అక్కడి పనితీరును పరిశీలించేవారు. తండ్రి కూడానే ఉంటూ వచ్చిన సురేశ్ బాబు కూడా, అదే దారిలో వెళుతున్నారు. ప్రతి విషయంలోను ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో రానా విషయం ప్రస్తావనకురాగా తనదైన తరహాలో ఆయన స్పందించారు.
రానా సినిమాల వెనుక నేను ఉన్నానని చాలామంది అనుకుంటారు. నేను చెప్పినా ఆయన వినిపించుకోడు .. తనకి కావలసినట్టుగా .. తోచినట్టుగా చేసుకుపోతుంటాడు. ఏ విషయంలోనైనా ఇలా చేస్తున్నానని చెబుతాడు .. అప్పుడు నాకు తోచిన సూచనలు ఏమైనా ఉంటే ఇస్తానుగానీ, తనకి సంబంధించిన అన్ని విషయాల్లోను ఆయన సొంత నిర్ణయాలనే తీసుకుంటూ ఉంటాడు. రానాకంటూ ఒక డ్రీమ్ .. ఒక విజన్ ఉన్నాయి. తను ఏం చేయాలనే విషయంపై క్లారిటీ ఉంటుంది. ఆ ప్రకారమే ఆయన ముందుకు వెళుతూ ఉంటాడు.
ఇలాంటి సినిమాలు చేయి .. అలాంటి సినిమాలు చేయి అని నేను చెప్పినా, నాకు ఇలాంటి సినిమాలే చేయాలని ఉంది అంటూ తన మనసులోని మాటను చెప్పేస్తాడు .. అప్పుడు నీ ఇష్టం అనేస్తాను. ఇక అభిరామ్ విషయానికొస్తే, తన ఫస్టు సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన ఉంటుంది. ఇక నా విషయానికొస్తే ఇంట్లో అంతా నాకు భయపడుతూ ఉంటారనీ, నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని బయట చెప్పుకుంటూ ఉంటారు. కానీ నేను ఎలా ఉంటాననేది నా సన్నిహితులకు తెలుసు. నా ఫ్యామిలీతో నేను సరదాగే ఉంటూ ఉంటాను” అంటూ నవ్వేశారు.











