క్రికెట్ అభిమానులకు షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సురేష్ రైనా ఆటను ఐపీఎల్ లో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇస్తూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓ న్యూస్ చెప్పింది. వ్యక్తిగత కారణాలతో రైనా ఈ సీజన్ కు దూరమైనట్లు వారు తమ అధికార ట్విట్టర్ ఖాతాలో తెలియచేశారు. కొన్ని రోజుల క్రితం జట్టుతో కలిసి రైనా దుబాయ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. 6 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న ఆయన బోర్డు నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు కూడా చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో రైనా ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడని జట్టు యాజమాన్యం చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.
శుక్రవారం జరిపిన కరోనా టెస్టులలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన 13 మంది కరోనా భారిన పడ్డ సంగతి తెలిసిందే. 12 మంది సహాయ సిబ్బంది, ఒకరు ఆటగాడు అని జట్టు సీఈఓ తెలిపారు. ఎవరి పేర్లు అధికారకంగా చెప్పకపోయినా అతను ఇంటర్నేషనల్ క్రికెటర్ అని వార్తలు వచ్చాయి. తాజాగా జట్టు నుంచి తప్పుకోవడంతో రైనా కరోనా భారిన పడ్డారా? అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ విశ్వనాధ్ చేసిన ట్వీట్ కూడా ఆ అనుమానాలను మరింత పెంచింది. ఈ సమయంలో సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని ఆయన ట్వీట్ చేయడంతో నెటిజన్స్ రైనాకు ఏమైంది? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే రైనా ఇండియాకు చేరుకున్నారు. ఆగస్ట్ 15న రైనా తన సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికారు. 33 ఏళ్ళ వయసులోనే కెరీర్ కు గుడ్ బై చెప్పడం క్రీడా అభిమానులు నిరాశకు గురైయ్యారు. అతని ఆటను ఐపీఎల్ లో చూడాలని ఆశ పడ్డ వారి ఆశలపై నీరు చల్లుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్-2020 సీజన్ మొదలు కానుంది. తొలిరోజే చెన్నై జట్టు ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.