అనగనగా ఒక రామతీర్థం. ఉత్తరాంధ్ర అయోధ్య అని ప్రజలు దాన్ని పరమపవిత్రమైన క్షేత్రంగా భావిస్తూ, అక్కడ కొలువైన రాముడిని ఆరాధిస్తూ ఉంటారు. గతంలో విభజన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ కొత్తగా అవతరించినప్పుడు, ప్రభుత్వం కూడా.. శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఇటు కడపజిల్లాలోని ఒంటిమిట్టతోపాటు, విజయనగరం జిల్లాలోని రామతీర్థంను కూడా ఎంపిక చేసింది.
అలాంటి పుణ్యక్షేత్రం రామతీర్థమే ఇప్పుడు రగులుతోంది. రాష్ట్రంలో ప్రజలు ఎంతో సంయమనం ఉన్నవారు కాబట్టి.. ఇంకా అంతా ప్రశాంతంగానే ఉన్నది గానీ.. రాజకీయపార్టీలు మాత్రం రామతీర్థంలో అగ్గిని రాజేస్తున్నాయి. అక్కడ కొండమీద ఉండే చిన్న ఆలయంలో ఉండే రాములవారి విగ్రహానికి తలను వేరు చేశారు.
ఇక్కడివరకు జరిగిన కథ అందరికీ తెలిసిందే..
ఈ రాములోరి విగ్రహ ధ్వంసం అనే కార్యక్రమానికి సంబంధించి.. ఇప్పుడు సూరిబాబు, రాంబాబు అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు.
ఇంతకీ ఎవరీ సూరిబాబు..
సూరిబాబు వాటర్ ట్యాంకులు, సంపులు శుభ్రం చేసుకుని పూట గడుకునే వ్యక్తి. పేదవాడు. కూలి పనితోనే పొట్టపోసుకునే వాడు. అలాంటి సూరిబాబును ఇప్పుడు పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తానే నేరం చేసినట్లుగా ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు తీవ్రంగా కొడుతున్నారనే మాట కూడా వినవస్తోంది. రామతీర్థం ఘటనలో అమాయకుడైన సూరిబాబును ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎలా ఇరుక్కున్నాడంటే.. తన బతుకుతెరువుకోసం బావులను శుభ్రం చేస్తూ బతికే సూరిబాబును.. రాముడి తలను వెతకడానికి కూలికి తీసుకువెళ్లారు. ఆయన భార్య చెబుతున్న ప్రకారం.. పోలీసులే వారి ఇంటికి వచ్చి.. సూరిబాబును ఆలయం వద్ద గల బావిలో వెతకడానికి రమ్మని తీసుకువెళ్లారు. పోలీసులు వచ్చిన సమయంలో.. అతను తనకు నడుం నొప్పిగా ఉన్నదని, బావిలోకి వెళ్లలేనని బతిమాలి చెప్పినప్పటికీ కూడా.. బలవంతంగా తీసుకువెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. అప్పుడున్న పరిస్థితిలో కొండ ఎక్కలేనని అతను అన్నప్పటికీ కూడా పోలీసులు అతడిని వెంట తీసుకువెళ్లినట్లుగా అతని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెబుతున్నారు. సూరిబాబు రామభక్తుడని, అలాంటి వాడిని ఇలాంటి తప్పుడుకేసులో పెట్టారని అంటున్నారు. పైగా తెల్లకాగితాలపై పోలీసులు బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని కూడా అంటున్నారు.
ఆరకంగా సూరిబాబు పోలీసులతో వెళ్లాడు. బావిలో దిగాడు. అతడి నడుముకు తాడుకట్టి బావిలోకి దింపారు. రాముడి తల దొరికింది. దాన్ని బయటకు తీసుకువచ్చాడు. ఒకచేత్తో తలను పట్టుకుని బయటకు వస్తోంటే.. రెండు చేతుల్తోనూ పట్టుకోమని అందరూ కేకలు వేసి చెప్పారు. రెండు చేతులతో రాముడి తలను పట్టుకుని వచ్చాడు.. చుట్టూ ఉన్న వాళ్లంతా, జై శ్రీరాం అంటూ పొలికేకలు పెడుతూ.. ఫోటోలు తీశారు. ఫోటోలు తీసిన వారిలో పోలీసులూ ఉన్నారు. తీరా ఏమైంది? బావిలోకి దిగి రాముడిని బయటకు తెచ్చిన సూరిబాబే.. ఇప్పుడు అనుమానితుడిగా జైల్లో ఉన్నాడు.
చంద్రబాబు సీరియస్
సూరిబాబును కేసులో ఇరికించడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయంలో పోలీసు అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘రామతీర్థం ఘటనలో అసలు దోషులను పట్టుకోడం మానేసి…అమాయకుడైన రామభక్తుడు సూరిబాబును తప్పు ఒప్పుకోవాలంటూ హింసించడం, తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారులు కోరితే ప్రమాదకరమైన బావిలోకి దిగి సహకరించినందుకు అతనికి, అతని కుటుంబానికి మీరు ద్రోహం చేస్తారా? నేరాన్ని తెలుగుదేశం మీదికి నెట్టాలనుకునే కుట్రలను సహించేది లేదు జాగ్రత్త! వైసీపీ వాహనంపై ఎవరో వాటర్ ప్యాకెట్లు వేస్తే, తెలుగుదేశం కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు పెట్టడం సిగ్గుమాలిన చర్య. పోలీసులూ! ప్రభుత్వం చెప్పిన దాన్ని గుడ్డిగా అనుసరిస్తూ, దేవుడి విషయంలో పాపం మూటకట్టుకోవద్దు.’’
అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్లు చేశారు.
సూరిబాబుకు మద్దతుగా పలువురు మాట్లాడుతున్నారు. కేసును సీఐడీకి అప్పగించడం, రెండు రోజుల్లో నిందితులు పట్టుబడతారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. కేసులో ఇరికించడానికి నిర్ణయించిన తర్వాతనే అలాంటి ప్రకటన వచ్చి ఉంటుందనే మాట వినవస్తోంది. అసలు దోషులను తేల్చలేక, ఆరోపణల్లో ఉక్కిరి బిక్కిరి అవుతూ.. ప్రభుత్వం ఏదో ఒకటి చేయడం కోపం ఇలా అమాయకులతో ఆడుకుంటోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.