తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ తో రిలీజ్ కాబోతోంది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా వేసుకుంది. అయితే అక్టోబర్ 30వ తేదిన అమెజాన్ ప్రైమ్ ద్వారా విడదుల చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్ . అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ తేదీ వాయిదా పడింది. ఈ విషయాన్ని సూర్య స్వయంగా వెల్లడించారు.
‘ఆకాశం నీ హద్దురా’ సినిమా విమానయాన రంగానికి చెందిన కథ. అందుకనే చిత్ర బృందం నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్లలో, నిజమైన విమానాలతో చిత్రీకరణ జరిపారు. ఈ షూటింగ్ కోసం చిత్ర బృందం అనేక కష్టాలు పడింది. విమానయాన రంగం, దేశ భద్రతా విభాగం నుండి అనేక అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. అయినా షూటింగ్ విషయంలో దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు మరో అడ్డంకి వచ్చింది.
సినిమా విడుదలకు విమానయాన శాఖ నుండి మరికొన్ని అనుమతులు, ఎన్ఓసీలు రావాల్సి ఉందని, అయితే అవి రావడం ఆలస్యమయ్యేలా ఉండటంతో 30వ తేదీన విడుదల లేదని, వాయిదా వేస్తున్నామని, అందరూ సహకరించాలని సూర్య తాజాగా ఒక లేఖ ద్వారా కోరారు. అయితే కొత్త రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు సూర్య. ఇప్పటికి వాయిదా వేస్తున్నామనే సూర్య ప్రకటించారు.
ఈ సినిమాను సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో ఒక ప్రతేకమైన పాత్రలో నటిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ ఫౌండర్, పైలట్ జీఆర్ గోపినాధ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం సూర్య అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురు చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.