ఓటీటీలో విడుదలయ్యే పెద్ద సినిమాల జాబితాలో ఇప్పుడు సూర్య సినిమా కూడా చేరిపోయింది. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా అక్టోబర్ 30న ఓటీటీలో విడుదలవుతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినమా విడుదలవుతుంది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో పెద్ద హీరోలు సైతం రాజీపడక తప్పడం లేదు. సినీ ప్రేక్షకులు ఓటీటీ లకు అలవాటు పడడంతో హీరోలు కూడా ఓటీటీ విడుదలకు మొగ్గుచూపుతున్నారు.
మరోవైపు ఇప్పట్లో థియేటర్లు ఓపెనయ్యే పరిస్థితి కనిపించకపోవటంతో నిర్మాతలు కూడా రాజీధోరణికి వచ్చేశారు. సూర్య నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో తెరకెక్కింది. దీన్ని సిఖ్య ఎంటర్ టైన్ మెంట్స్, 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ రోజు వినాయక చవితి సందర్బంగా సూర్య ట్విట్టర్ వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. విడుదల తేదీ అక్టోబరు 30 అని కూడా ప్రకటించారు.