( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో సత్య ప్రమాణాల సీరియల్ కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వ్యవహారం ఇరు పార్టీలకు పాకింది. నాలుగు రోజులుగా ఈ వ్యవహారంపై విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన భూ ఆక్రమణలు, బినామీల ఆరోపణలపై స్పందించిన తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈస్ట్ పాయింట్ కాలనీ షిరిడి సాయిబాబా ఆలయానికి వచ్చి భగవంతుడిపై ప్రమాణం చేయాలని, వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై సంతకం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ సీపీ నాయకులు రోజుకో డ్రామా ఆడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎంపీకి సవాలు విసిరితే… ఇతర నాయకులు స్పందించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గురు, శుక్రవారాలు వైఎస్సార్సీపీ నాయకులు ప్రెస్ మీట్‌లు పెట్టి ఎమ్మెల్యే వెలగపూడిపై విరుచుకుపడ్డారు. శనివారం వైఎస్సార్సీపీ నాయకురాలు ఏ. విజయనిర్మల జనసమీకరణ చేసి ఆలయం వద్దకు చేరుకుని ప్రమాణాలు చేశారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆదివారం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తన అనుచరవర్గంతో ఈస్ట్ పాయింట్ సాయి బాబా ఆలయం వద్దకు చేరుకుని సత్య ప్రమాణాలు చేశారు. ఆయనపై చేసిన ఆరోపణలన్నీ వాస్తవమని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఒక సీరియల్‌లా కొనసాగుతోందని విశాఖ వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు.
తెరపైకి వంగవీటి హత్య…
వంగవీటి రంగా హత్య కేసులో ఎ 10 ముద్దాయిగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహారాన్ని అధికార పార్టీ నాయకులు వెలుగులోకి తీసుకువస్తున్నారు. హత్య కేసులో నిందితుడని, రౌడీ షీటర్ అని, అటువంటి వ్యక్తికి … ఎంపీ, వైఎస్సార్సీపీని విమర్శించే హక్కు లేదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఘాటైన సమాధానం ఇస్తున్నారు. ఒక కేసులో ఏ 10 ముద్దాయిగా ఉన్న వ్యక్తికి మాట్లాడే అర్హత లేకపోతే, అనేక ఆర్థిక నేరాల్లో ఏ 2 గా ఉన్న వ్యక్తికి అర్హత ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. గురివింద గింజకి ఉన్న నల్ల మచ్చ కనిపించదని, . వైఎస్సార్సీపీ నేతల ప్రకటనలు కూడా అలాగే ఉంటున్నాయని మండిపడుతున్నారు