పాలకుడు అంటే.. ప్రజలను పరిరక్షించాలి. ప్రజా ధనాన్నికాపాడాలి. ఆ డబ్బును నియంత్రణతో ఖర్చు పెట్టాలి. దుబారాను అరికట్టాలి.. ఇలా ఎన్నెన్నో మంచి పనులను చేయాలి. అప్పుడే ఆ ముఖ్యమంత్రి జనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మన దేశంలో ఇప్పుడున్నసీఎంలలో ఆ స్థాయిలో పనిచేస్తున్న సీఎంలు దాదాపుగా లేరనే చెప్పాలి. సీఎం కుర్చీ ఎక్కగానే.. హంగూ ఆర్భాటాలతో పాటుగా డాబూ దర్పాలను ప్రదర్శిస్తూ తమదైన వైలి పైత్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రజా ధనాన్ని నీళ్లలా ఖర్చు పెట్టేస్తారు. వ్యక్తిగత పర్యటనలకు సైతం ప్రత్యేక విమానాలను వినియోగిస్తారు. అయితే ఈ తరహా చర్యలకు తమిళనాడు సీఎంగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పూర్తిగా వ్యతిరేకమనే చెప్పాలి. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఆయనను యావత్తు దేశంలోని అందరు సీఎంలకు ఆదర్శంగా నిలిపింది.
వారి ఫొటోలను తీయనక్కర్లేదు
రాజకీయం అంటే.. ఎన్నికల్లో వైరి వర్గాలతో పోటీ పడి గెలుపు తీరాలకు చేరేందుకు వ్యూహాలు రచించడం. ఎన్నికలు ముగిసిన వెంటనే వాటిని అన్నింటినీ పక్కనపెట్టడం. సిసలైన రాజకీయమంటే ఇదే. అయితే ఈ తరహా రాజకీయం మన దేశంలో కాదు కదా.. ఇతర దేశాల్లోనూ కనిపించడం లేదు. అలాంటిది సిసలైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా స్టాలిన్ నిలుస్తున్నారు. తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలిత సర్కారు హయాంలో ప్రారంభమైన అమ్మ క్యాంటీన్లను కొనసాగించనున్నట్లుగా ప్రకటించారు. దీనిపై స్టాలిన్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా పాఠశాల విద్యార్థులకు ఏటా అందిస్తున్నస్కూల్ బ్యాగులపై అప్పటికే ముద్రించిన మాజీ సీఎంలు జయలలిత, ఎడప్పాడి పళనిసామిల ఫొటోలను తీసేయాల్సిన అవసరం లేదని, ఆ బ్యాగులనే పంపిణీ చేయాలని ఆదేశించి స్టాలిన్ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈ చర్య ద్వారా ఏకంగా రూ.13 కోట్ల మొత్తాన్ని ఆయన ఆదా చేశారట.
శత్రుత్వానికి చెల్లు చీటి
స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం గురించిన గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అంబిల్ మహేశ్ ఆసక్తికర వివరాలను వెల్లడించారు. మొన్నటి ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించగా.. అన్నాడీఎంకే అధికారం కోల్పోయింది. మే నెలలో ఎంకే స్టాలిన్ తమిళనాడు కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే పాఠశాల విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల తయారీ అప్పటికే పూర్తి అయ్యింది. వాటిపై జయలలిత, ఎడప్పాడి పళనిసామి ఫొటోలను కూడా ముద్రించారు. ఇందుకోసం ఏకంగా రూ.13 కోట్ల మేర ఖర్చు పెట్టారు. ఈ బ్యాగుల పంపిణీ పూర్తి కాకుండానే ఎడప్పాడి పదవి కోల్పోయారు. అయితే ఆ బ్యాగులను పంపిణీ చేయొద్దని, వాటి స్థానంలో ఎంకే స్టాలిన్ గానీ, కరుణానిధి ఫొటోను గాని ముద్రించి కొత్త బ్యాగులను పంపిణీ చేయాలని మహేశ్ పై పార్టీ నేతలు ఒత్తిడి చేశారట. ఈ విషయంపై సీఎం హోదాలో ఉన్న స్టాలిన్ తో చర్చించేందుకు సీఎంఓకు వెళ్లగా.. ‘‘సీఎం కార్యాలయంలో రాజకీయాల మాటలొద్దు. ఆ బ్యాగులను పాడేయాల్సిన అవసరం లేదు. జయ, ఎడప్పాడి ఫొటోలు ఉన్న బ్యాగులనే పంపిణీ చేయండి. దానివల్ల ఆదా అయ్యే రూ.13 కోట్లను ఇతరత్రా మంచి కార్యక్రమాలకు వినియోగించండి’’అని స్టాలిన్ ఒక్క ముక్కలో తేల్చేశారట. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఎంకే స్టాలిన్ దేశంలోని అందరు సీఎంలకు ఆదర్శమే కదా.
Must Read ;- మోదీ మార్కు.. ఇస్రోకీ ప్రై‘వేటు’