దేశ రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేపై స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఇటు డీఎంకే వృద్ధ నేత కరుణానిధి.. ఇద్దరూ లేకుండా జరిగిన తొలి ఎన్నికల్లో స్టాలిన్ సత్తా చాటారు. ఎన్నికల్లో విజయంతో సీఎం పీఠాన్ని అధిష్ఠించేదాకే రాజకీయాలు మాట్లాడిన స్టాలిన్.. ఆ తర్వాత విపక్షాన్ని తులనాడుతూ ఏనాడూ మాట్లాడింది లేదనే చెప్పాలి. అంతేకాకుండా విపక్ష నేతలకు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంటూ సాంత్వన చేకూర్చేలా వ్యవహరిస్తున్న స్టాలిన్.. విపక్షానికి చెందిన నేతలను అసలు ప్రత్యర్థులుగానే చూడటం లేదు. ఇక సీఎంఓలో రాజకీయాలు మాట్లాడబోనంటూ సొంత పార్టీ నేతలకు తెగేసి చెప్పిన స్టాలిన్.. రాజకీయాలే మాట్లాడదలచుకుంటే పార్టీ కార్యాలయానికి వెళదాం పదండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తనదైన శైలి మార్కును చూపిస్తున్న స్టాలిన్.. ఇండియా టుడే చేపట్టిన సర్వేలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు.
ఏ పని చేసినా సింప్లిసిటీనే..
సీఎంగా ఏ ఒక్కరికీ అందుబాటులో లేని సౌకర్యాలు, గౌరవమర్యాదలు, ప్రోటోకాల్.. ఇవేవీ స్టాలిన్ ను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఉంటే.. సీఎంఓలో, లేదంటే జనంలోనే. ఇంటిలో ఉన్న సమయంలోనూ జనాన్ని ఎడ్యుకేట్ చేసేలా పలు చర్యలు కూడా స్టాలిన్ తీసుకుంటున్న వైనం నిజంగానే అభినందించదగ్గదే. ఇంటిలోని జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న వీడియోను అప్పుడెప్పుడో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన స్టాలిన్.. బాడీని కండీషన్ లో పెట్టుకోవాల్సిన అవసరతను చెప్పారు. అందుకోసం వర్కవుట్లు ఎంత అవసరమన్న విషయాన్ని కూడా చెప్పారు. ఇక మొన్నటికి మొన్న సర్కారీ పాఠశాలల విద్యార్థులకు జయలలిత ఫొటోతో ఉన్న స్కూల్ బ్యాగులనే పంపిణీ చేసి సంచలనం సృష్టించారు. ఈ చర్య ద్వారా రాజకీయం ఎన్నికల దాకే. ఆ తర్వాత ఏ పనిచేసినా.. ప్రజా ధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా సాగాలని అందరికీ చేసి చూపించారు. అయినా ఇప్పుడు స్టాలిన్ గురించి ఇప్పుడిదంతా ఎందుకనుకుంటున్నారా? ఇప్పుడు స్టాలిన్ కు చెందిన మరో వీడియో వైరల్ అయ్యింది కాబట్టి.
మార్నింగ్ వాక్‌లో జనంతో మమేకం
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సీఎం పోస్టులో ఉండి కూడా స్టాలిన్ మార్నింగ్ వాక్ కోసం చెన్నైలోని అడయార్ పార్క్‌కు వచ్చారు. ట్రాక్ సూట్ లో ప్రత్యేకించి గమనిస్తే తప్పించి గుర్తు పట్టలేని విధంగా తన మానాన తాను వాకింగ్ చేస్తున్న స్టాలిన్ ను కొందరు వాకర్స్ గుర్తించారు. ఆయనతో మాటామంతీ కలిపారు. తనతో మాట్లాడుతున్న వాకర్స్ ను నిరాశపరిచేందుకు మనస్కరించని స్టాలిన్.. వారితో మాట కలిపారు. వారు చెప్పేదంతా విన్నారు. మీ పాలన బాగుంది సార్ అంటే.. వారితో పాటే చిరునవ్వులు చిందించారు. వారు వేసిన జోకులకు మనసారా నవ్వారు. తనతో మాట్లాడిన వారు ఎక్కడివారో, ఏం చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు. సీఎంగా ఉండి కూడా ప్రజల మధ్య ఇలా సాధారణంగా ఉండటం అసాధారణమని, అది మీకు మాత్రమే సాధ్యమైందని వాకర్స్ చెప్పిన వారితో ఇంకాస్త సేపు మాట్లాడి వెళ్లొస్తానంటూ సెలవు తీసుకుని బయలుదేరారు. మొత్తంగా ఏ పని చేసినా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న స్టాలిన్ ను మన నేతలు ఎప్పుడు ఆదర్శంగా తీసుకుంటారో చూడాలి.
Must Read ;- విద్యుత్ చార్జీల పెంపుతో ఏపీ ప్రజలపై పెను భారం పడింది.