సాధారణంగా అందమైన కథానాయికలు తమకి అవకాశాలు తగ్గగానే అయోమయంలో పడిపోతారు. మరో భాషలో అవకాశాలను అందుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ మార్కెట్ పెంచుకోవడానికి అనేక కష్టాలు పడతారు. అయితే హీరోయిన్ గా మాత్రమే చేయాలనే ఆలోచన నుంచి బయటికి వచ్చి, నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఇతర పాత్రలను కూడా చేయాలనే సాహసోపేతమైన నిర్ణయాలను కొంతమందే తీసుకుంటారు. అలాంటి కథానాయికలలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముందుగా కనిపిస్తుంది.
కథానాయిక అందంగా .. బొద్దుగా వుంటే తమిళ ప్రేక్షకులు ఇష్టపడతారు. వాళ్ల ఇష్టానికి తగినట్టుగానే వరలక్ష్మీ శరత్ కుమార్ ఉండేది. అయితే కథానాయికగా ఆమె ఆశించినస్థాయికి చేరుకోలేకపోయింది. ఈ విషయాన్ని గ్రహించడానికి ఆమె ఎక్కువ సమయాన్ని కూడా తీసుకోలేదు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు .. విలన్ రోల్స్ తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతాయని ఆమె గ్రహించింది. ఎలాంటి మొహమాటాలు లేకుండా ఆ తరహా పాత్రలను చేయడానికి ఆమె ముందుకు వచ్చింది. తనని గురించి తాను వేసుకున్న అంచనా తప్పలేదు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి. లేడీ విలన్ అంటే ముందుగా వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు గుర్తుకు వచ్చేలా ఆమె చేయగలిగింది.
వరలక్ష్మీ శరత్ కుమార్ లో ప్రధానమైన ఆకర్షణ ఆమె కళ్లు. విశాలమైన ఆ కళ్లతో వీలైనంతగా ఆమె విలనిజాన్ని ఆవిష్కరించగలదు. వెరైటీగా అనిపించే వాయిస్ తో కరకుగా డైలాగ్స్ ను చెప్పగలదు. అటు హుందాగా కనిపించే విలన్ గాను .. ఇటు మాస్ గా కనిపించే విలన్ గాను మెప్పించిన సమర్థురాలమే. ఈ కారణంగానే ఆ తరహా పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తమిళం నుంచి అనువాదాలుగా వచ్చిన ‘పందెం కోడి 2‘, ‘సర్కార్’ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత చేరువ చేశాయి. తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాలో ఆమె పోషించిన నెగెటివ్ రోల్ కి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ సినిమాలోని విలన్ రోల్ పై ఆమె తనదైన ముద్ర వేసింది. నిండుగా .. నిబ్బరంగా .. గంభీరంగా కనిపిస్తూ తాను అనుకున్న పనిని పూర్తిచేసే ఆ పాత్రలో ఆమె జీవించింది. మళ్లీ ఇప్పుడు అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమాతోను .. రవితేజ ‘క్రాక్’ సినిమాతోను ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. విభిన్నమైన కథలతో వస్తున్న ఈ రెండు సినిమాల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇక్కడ కూడా బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ చేతిలో అరడజను తమిళ సినిమాలు వున్నాయి. రొమాంటిక్ కామెడీ .. హారర్ కామెడీ .. క్రైమ్ డ్రామా .. ఇలా డిఫరెంట్ జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో చాలావరకూ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలన్నింటిలోను ఒక పాత్రకు .. మరో పాత్రకు సంబంధం లేకుండా వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తోంది. విలక్షణమైన ఈ పాత్రలన్నీ తన క్రేజ్ ను మరింత పెంచుతాయని ఆమె భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఆ సినిమాలు నిలబెట్టాలనే ఆశిద్దాం.
Must read ;- ‘క్రాక్’ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర బృందం