కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు ఆయన తండ్రి చంద్రశేఖర్ కు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. విజయ్ తండ్రి చంద్రశేఖర్ ‘విజయ్ మక్కల్ ఇయక్కం‘ అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీ కూడా చేస్తానని ప్రకటించారు కూడా. ఆ ప్రకటన జారి అయిన కొద్ది సేపటికే విజయ్ తనకు తన తండ్రి పెట్టిన రాజకీయ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, తన అభిమానులు ఎవ్వరు ఆ పార్టీలో చేరద్దని కోరాడు. అంతేకాకుండా తన అభిమాన సంఘం పేరు కాని, తన ఫోటోను కాని వాడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించాడు. అలాగే చంద్రశేఖర్ భార్య, విజయ్ తల్లి శోభాచంద్రశేఖర్ కూడా తన భర్త స్థాపించిన పార్టీలో చేరనని ఇప్పటికే ప్రకటించారు.
Also Read:-తమిళ హీరో విజయ్, అతడి తండ్రి మధ్య ముదురుతున్న రాజకీయ వివాదం
ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ విజయ్ కు నాకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, రాజకీయ పార్టీ స్థాపించడం పూర్తిగా తన నిర్ణయమేనని చంద్రశేఖర్ తెలిపారు. ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ ద్వారా గత 27ఏళ్ళ నుండి అనేక మంచి పనులు చేశామని, అందులోని సభ్యులకు గుర్తింపు రావాలనే తను ఈ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించానని అన్నారు చంద్రశేఖర్. ప్రస్తుతం విజయ్ విష వలయంలో చిక్కుకొని కొట్టామిట్టాడుతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అలాగే విజయ్ చుట్టూ దుష్ట శక్తులు చేరాయని త్వరలోనే తన కొడుకు కళ్ళు తెరుస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసారు. తన ఫోటోను, అభిమాన సంఘం పేరు కాని ఉపయోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అన్న విజయ మాటలకు కూడా ఆయన తండ్రి స్పందించారు. తనను జైలుకు పంపినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చంద్రశేఖర్ కుండబద్దలు కొట్టారు. మొదటిగా విజయకు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసింది తానేనని, తర్వాత రోజుల్లో ఆ సంఘం పేరును ‘మక్కల్ ఇయక్కంగా’ పేరు మార్చి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నానని చంద్రశేఖర్ తెలిపారు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఆయన మరోసారి స్పష్టం చేసారు. ఈ రాజకీయ వివాదం ఎంతవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.
Also Read:-దీపావళికి రానున్న విజయ్ మాస్టర్ తెలుగు టీజర్










