సయీఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన‘తాండవ్’ వెబ్ సిరీస్ వివాదం శ్రుతి మించి రాగాన పడుతోంది. ఆ సన్నివేశాలు తొలగిస్తామని, రీషూట్ చేస్తామని ప్రకటించినా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. యాంటీ హిందూ సిరీస్ గా నెటిజన్లలో ఈ సిరీస్ ముద్ర వేసుకుంది. #banTandavnow,#boycottTandav ఈ హేజ్ ట్యాగ్ లు వైరల్ అవుతున్నాయి. ఇందులో హిందూ దేవుళ్లు, దేవతలపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడమే దీనికి ప్రధాన కారణం. మహారాష్ట్ర కర్ణిసేన ఈ వివాదాన్ని భుజాన వేసుకుంది.

Also Read:-వివాదాల సుడిగుండంలో సయీఫ్ అలీఖాన్ ‘తాండవ్’
ఇందులో హిందూ దేవుళ్ల మీద వ్యాఖ్యలు చేసిన వారి నాలుకలు కత్తిరించి తెచ్చిన వారికి కోటి రూపాయలు బహుమానంగా ఇవ్వనున్నట్టు కర్ణిసేన చీఫ్ అజయ్ సెంగార్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కంటెంట్ ఇండియా హెడ్ అలీ అబ్బాస్ జాఫర్, వెబ్ సిరీస్ నిర్మాత హిమాంశు కృష్ణ మెహ్రా, రచయిత సోలంకి, తదితరులపై లక్నో హజ్రత్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలోని ఘట్కోపర్‌లో మరో కేసు నమోదైంది. ఇలా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పినా వాటిని పరిగణనలోకి తీసుకునేది లేదని నిరసనకారులు తెగేసి చెబుతున్నారు.
జనవరి 17న ఈ సిరీస్ విడుదలైంది. ఇందులో 17వ నిమిషంలో అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి. అలాగే చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) కూడా పాట్నాలో ఆందోళనలు చేపట్టింది. అక్కడ గాడిదల మెడలో తాండవ్ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, సయీఫ్ అలీఖాన్ ఫొటోలను కట్టి వాటిపై దేశ ద్రోహి, హిందూ వ్యతిరేకి అని రాసి ఊరేగించారు. ఈ వెబ్ సిరీస్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఉత్తర బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. 100 మంది అఖిల్ భారతీయ విద్యా పరిషత్ సభ్యులు తాండవ్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు.
ఇంతకీ తాండవ్ లో ఏముంది?
తాండవ్ వెబ్ సిరీస్ లో ఉన్న రెండు సన్నివేశాలు ఇంత పెద్ద ఆందోళనకు కారణమయ్యాయి. ఇవి హిందూ మతాన్ని అవహేళన చేసేలా ఉన్నాయన్నది ప్రధాన అభియోగం. రాజకీయ నాయకుడిగా మారే విద్యార్థి నాయకుడు శివ పాత్రను మహ్మద్ జీషన్ అయూబ్, సంధ్య మృదుల్ – అనుప్ సోని జంటల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఈ డైలాగులు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
Must Read ;- విక్రమ్ భట్ ‘అనామిక’ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్

Also Read ;- మార్చి లో ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనబోతున్న బాలీవుడ్ నటుడు
మొదటి ఎపిసోడ్ లో సన్నివేశం 1: కాలేజీ నాటకంలో విద్యార్థి నేత శివ (మహ్మద్ జీషన్ అయూబ్) శివుడి పాత్రను పోషిస్తాడు. ఆ గెటప్ సంప్రదాయ బద్దంగా లేదు.స్టైలిష్ శివుడిగా కనిపిస్తాడు. సూట్ ధరించడంతోపాటు ఓ చేత్తో త్రిశూలం పట్టుకుంటాడు. మొహంపైనా, మెడపైనా నీలిరంగు వేశారు. రాముడితో పోలిస్తే సోషల్ మీడియాలో శివుడికి తక్కువ మంది ఫాలోవర్లు ఉండటం, వారిని పెంచుకోడానికి ఏంచేయాలి? అని మాట్లాడటం జరుగుతుంది. దానికి నారదుడి పాత్రధారి శివుడికి ఓ సలహా ఇస్తాడు.
ట్విట్టర్‌లో ఫాలోవర్లను పెంచుకోడానికి సంచలనాత్మక ట్వీట్ పెట్టమంటాడు. ప్రస్తుతం యూనివర్శిటీ విద్యార్థులు ‘ఆజాది ఆజాది’ అని ఎందుకు జపిస్తున్నారో చెప్పమంటాడు. దేశంలో పేదరికం, ఫ్యూడలిజం, కుల వివక్ష గురించి విద్యార్థులు మాట్లాడుకుంటున్నా వారు వీటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే సన్నివేశం ఇది. ఇక్కడ ‘మత్లబ్ దేశ్ సే అజాది నహి చాహియే, దేష్ మే రెహ్తే హూ అజాది చాహియే’ అంటూ శివ డైలాగ్ చెబుతాడు. ఈ సన్నివేశం వివాదాస్పదంగా మారింది.
ఎపిసోడ్ 8లో రెండో సన్నివేశం : సంధ్య (సంధ్య మృదుల్), ఆమె ప్రియుడు కైలాష్ కుమార్ (అనుప్ సోని) మధ్య జరిగే సన్నివేశం ఇది. దళిత వ్యక్తి ఉన్నత కులానికి సంబంధించిన స్త్రీతో డేటింగ్ చేయడం వల్ల ఎంతో కాలంగా గురైన వివక్షకు అది ప్రతీకారమవుతుందంటూ డైలాగ్ ఉంటుంది. తాండవ్ వెబ్ సిరీస్ ఎలా ఉన్నా ఈ వివాదంతో మాత్రం మంచి పబ్లిసిటీ మాత్రం దొరికినట్లయింది. ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందో అర్థం కావడం లేదు. దీనికి రాజకీయ రంగు పులుముకుంటోంది.
– హేమసుందర్ పామర్తి











