విత్తన గణపతి… ఇదేదో పదం కొత్తగా ఉంది కదూ. దీని ప్రత్యేకత ఏమిటో నటుడు, రచయిత తనికెళ్ల భరణి వివరించారు. ఈరోజు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తనికెళ్ళ భరణి విత్తన గణపతి గురించి మాట్లాడారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – ఏకో ఫ్రెండ్లీ గణేష్ లో భాగంగా కాదంబరి కిరణ్ ద్వారా వినాయక చవితి ముందు విత్తన గణపతి విగ్రహాన్ని భరణికి పంపించారు.
‘మా ఇంట్లో కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాం. ఈ విత్తన గణపతి ప్రత్యేకత ఏమిటంటే దీన్ని మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకుంటే ఒక విత్తనం ద్వారా కొన్ని రోజుల్లో మనకు ఒక మొక్క మొలుస్తుంది . ఆ మొక్కని అలాగే మన ఇంటి పరిసరాల్లో నాటుకోవాలి. కొత్త జీవం మొక్క ద్వారా ఆవిర్భవిస్తుంది . ఆ మొక్క ని పవిత్రంగా భావించి , పెంచినట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం జీవించవచ్చు .ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ శ్రీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను’ అని భరణి వివరించారు.