ప్రస్తుతం భారతీయ తెరమీద మోస్ట్ అవైటింగ్ మూవీ రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా రాజమౌళి సినిమాలు రిలీజ్ కావడానికి రెండు, మూడు సంవత్సరాలు టైమ్ తీసుకుంటాయి. అలాంటిది ఇప్పుడీ సినిమా తిరిగి పట్టాలెక్కడానికి, షూటింగ్ పూర్తి చేసుకోవడానికి మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది.
వచ్చే సంక్రాంతికి విడుదలయ్యేలా పక్కా ప్లానింగ్ ను సిద్ధం చేసిన రాజమౌళి.. సినిమాను వచ్చే సమ్మర్ కి గాని విడుదల చేయలేని పరిస్థితి. ఈ సినిమా నుంచి చివరగా వచ్చిన అప్డేట్ . రామ్ చరణ్ పుట్టినరోజు కు భీమ్ పాత్రధారి యన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ రామరాజు వీడియో మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మరే అప్డేటూ రాలేదు.
యన్టీఆర్ పాత్రకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు కానీ.. వారికి నిరాశే ఎదురైంది. ఈ సినిమా తిరిగి చిత్రీకరణకు వెళితేనే కానీ.. యన్టీఆర్ పాత్రకి సంబంధించిన అప్డేట్ ఇవ్వలేమని రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు కూడా. రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నాడు కాబట్టి.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కానున్నట్టు తాజా సమాచారం.
షూటింగ్ మొదలు పెట్టేముందు జిమ్ లో తగినంత వర్కౌట్లు చేస్తామని , లేదంటే బాడీ షేప్స్ మారిపోయే ప్రమాదం ఉందని, రామ్ చరణ్ గతంలో ఎన్నోసార్లు చెప్పాడు. జక్కన్న కూడా ఈ విషయంలో చాలా సార్లు తారక్, చెర్రీలను కూడా హెచ్చరించాడు. తాజాగా ఇప్పుడు మరోసారి చెర్రీ జిమ్ లోకి అడుగుపెట్టడంతో ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నదని అర్ధమవుతోంది. ఆ మేరకు తారక్ కూడా జిమ్ లో వర్కవుట్ చేసి.. షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడని వార్తలొస్తున్నాయి.
వచ్చే నెల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ తిరిగి సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క హీరోలిద్దరూ షూటింగ్ కు రెడీ అవుతుంటే.. ఇందులో చెర్రీ సరసన సీతగా నటిస్తోన్న అలియా భట్ సైతం ఒక నెల ముందుగానే హైద్రాబాద్ వచ్చి షూటింగ్ లో జాయిన్ కానున్నట్టు సమాచారం అందుతోంది. ఆ మేరకు రాజమౌళికి ఈ విషయమై గ్రీన్ సిగ్నలిచ్చిందట. మరో వైపు సీజీ వర్క్ పైన కూడా రాజమౌళి దృష్టిపెట్టాడట. ఇక థియేట్రికల్ రిలీజ్ సమస్యలున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజమౌళి బృందం దీనిపై ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది అన్న విషయం అందరిలోనూ ఆసక్తిని కలగజేస్తోంది. ఏది ఏమైనా .. ఆర్.ఆర్.ఆర్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుండడం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇక షూటింగ్ రీస్టార్ట్ అవడమే తరువాయి.











