రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులంటే దిగ్గజ సంస్థలు భయపడే పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టేందుకు పేరొందిన సంస్థలు ఏపీలో ముందుకు వస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో రూ.49 వేల కోట్ల పెట్టుబడితో పునరుత్వాదక విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ – NREDCAPతో అగ్రిమెంట్ చేసుకుంది. ఇందులో భాగంగా సంస్థకు భూములు, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం సహకారం అందించనుంది. మంత్రులు నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, CS కె.విజయానంద్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ, ఎండీ దీపేశ్ నందా, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ కమలాకరబాబు అగ్రిమెంట్ చేసుకున్నారు.
సీఎం చంద్రబాబు ముందుచూపుతో టాటాతో ఒప్పందం జరిగిందన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో పునరుత్వాదక ఇంధన రంగంలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 160 గిగావాట్ల పునరుద్పాదక శక్తి సామర్థ్యంతో ప్రాజెక్టులు ఏర్పాటు కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీరంగంలో 7.5లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర పునరుద్పాదక విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందన్నారు లోకేష్. రాష్ట్రంలో గ్రీన్‌ఎనర్జీ లక్ష్యాలను అధిగమించేందుకు ట్రాన్స్‌ఫర్మేషన్‌ను వేగవంతం చేయాలని NREDCAPను లోకేశ్ ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో దీపేశ్ నందా. పునరుత్పాదక విద్యుత్తు రంగాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఏపీ సర్కార్‌కు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామన్నారు. 7 గిగావాట్ల వరకూ స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రంగా మారుతుందన్నారు.
మరోవైపు AI వినియోగం ద్వారా పౌర సేవలు, పాలనా సామర్థ్యాలను మెరుగుపరచుకుంటామన్నారు మంత్రి లోకేశ్. పాలనలో సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి సమక్షంలో సాంకేతిక సహకారంపై వాద్వానీ ఫౌండేషన్ తరఫున వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సీఈవో ప్రకాశ్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మధ్య అగ్రిమెంట్ జరిగింది. టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు లోకేష్. ఏఐతో పాలనలో మార్పులు తీసుకురావడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమన్నారు వాద్వానీ ఫౌండేషన్ అధికారి ప్రకాశ్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగుల్లో టెక్నికల్ స్కిల్స్ పెంచడం ద్వారా వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా అత్యాధునిక AI కోర్సులు అందిస్తామన్నారు.