విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది.మేయర్ అభ్యర్థిని కూడ ప్రకటించి టీటీపీ ప్రచారంలో దూసుకుపోతుండగా ప్రధాన పత్యర్థి పార్టీ అయిన వైసీపీ మేయర్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది.అంతేగాక అమరావతి రాజధాని తరలింపు. ఆస్తి పన్నుల పెంపు విషయాలు వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయవాడ ఎంపీ కేశినేని నాని పంతం నెగ్గిందనే చెప్పవచ్చు. కేశినేని కూతురు శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో టీడీపీలో గ్రూపు రాజకీయాలకు తెరపడింది. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ, టీడీపీ నేత నాగుల్ మీరా టీడీపీ మేయర్ అభ్యర్థిపై అభ్యంతరం వ్యక్తం చేసినా అధిష్ఠానం మాత్రం కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆ ముగ్గురు నేతలు కూడ ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో టీడీపీ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని విజయవాడ మొత్తం ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. కేశినేని శ్వేత కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు చురుగ్గా ఉన్నారని చెప్పవచ్చు.
వైసీపీ మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ
విజయవాడలో వైసీపీ మేయర్ అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. మీడియాలో కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వైసీపీ నాయకుడు గౌతమ్‌రెడ్డి కుమార్తె లిఖితారెడ్డి, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో బ్రాహ్మణుల ఓట్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బండి పుణ్యశీల పేరు మేయర్ అభ్యర్థిగా తెరమీదకు తీసుకువచ్చారు. విజయవాడలో గెలవాలంటే కాపులనుకానీ, బ్రాహ్మణులను కానీ మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఓట్లు కొల్లగొట్ట వచ్చని పార్టీలు అంచనా వేస్తున్నాయి. విజయవాడలో రెడ్డి సామాజికవర్గం చాలా తక్కువ. ఈ సమయంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని తెరమీదకు తీసుకువస్తే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే ముందుగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన బండి పుణ్యశీల పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తే మేయర్‌ను ఎవరిని చేస్తారనేది ఇప్పుడే అంచనా వేయడం కష్టమే.

రాజధాని తరలింపు ప్రభావం
అమరావతి రాజధానిని విశాఖకు తరలిస్తామని సీఎం జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దీంతో గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. రాజధానిని విశాఖకు తరలించడం వల్ల గుంటూరు, విజయవాడ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీని ప్రభావం కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజధాని తరలింపుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మంత్రులు ఎవరూ నోరు మెదపవద్దని వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి విశాఖ నగరం నుంచి పాలన సాగిస్తామని ప్రకటించిన మంత్రులు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. ఇక కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి కాగానే మరలా రాజధాని తరలింపు వ్యవహారం తెరమీదకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని తరలింపు ప్రకటనతో విజయవాడలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే చెప్పవచ్చు.
పన్నుల పెంపు ప్రకటన టీడీపీ ఆయుధం
కార్పొరేషన్ ఎన్నికలు ముగియగానే ఇంటిపన్ను 5 రెట్లు పెరుగుతుందని టీడీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. గతంలోనే పన్నులు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చింది. కేవలం స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే పన్నుల పెంపును వాయిదా వేశారు. ప్రభుత్వం నవరత్నాల పథకాలకే వేల కోట్లు అప్పులు చేస్తోంది. ఇక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విదిల్చే సామర్థ్యం లేదు. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వారి ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చే విధంగా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే స్థానిక ఎన్నికలు ముగిసే వరకు పన్నుల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే పన్నుల బాదుడు తప్పదని టీడీపీ ప్రచారం అస్త్రంగా వాడుకుంటోంది. టీడీపీని గెలిపిస్తే అన్న క్యాంటీన్లు తెరవడంతోపాటు, ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి పన్ను కూడా పెంచమనే హామీ బాగా ప్రచారంలోకి వెళ్లింది. ఇక రాజధాని తరలింపు వ్యవహారం కూడా టీడీపీకి కలసివచ్చే అంశంగా ఉంది. అయితే కార్పొరేషన్లో టీడీపీ గెలిచినా రాజధాని తరలిపోకుండా ఆపే సామర్థ్యం లేదు కాబట్టి ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించడం లేదు. ప్రధానంగా విజయవాడ నగరంలో పడకేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. విజయవాడ నగరం నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ప్రచారంలో తక్కువగానే కనిపిస్తున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో వైసీపీ అధిష్టానం వెల్లపల్లిని ప్రచారానికి దూరంగా పెట్టినట్టు కనిపిస్తోంది.
Must Read ;- టీడీపీ శ్రేణులకు మనోధైర్యం.. మూడువైపులా నేతల ప్రచారం











