రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సరికొత్త చరిత్ర లిఖించింది. కడప నుంచి కర్నూలు వరకు, అనంతపురం నుంచి చిత్తూరు వరకు కూటమి సునామీకి వైసీపీ అడ్రస్ గల్లంతైంది. ‘రాయలసీమ మా అడ్డా’ అని చెప్పుకునే వైసీపీకి ప్రజా తీర్పు చెంపపెట్టులా మారింది. సొంత గడ్డపైనే జగన్ మోహన్ రెడ్డి విలవిలలాడేలా కూటమి అభ్యర్థులు ఏకపక్ష విజయాలతో దూసుకుపోయారు.
ముఖ్యంగా వైఎస్ అడ్డాగా భావించే కడప జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక బద్వేల్ మున్సిపల్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీల్లో టీడీపీ పసుపు జెండా ఎగిరేసింది. ఇక ఎర్రగుంట్ల మున్సిపాలిటీని బీజేపీ తన హస్తగతం చేసుకుంది.
ఇప్పటికే కడప జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ పదవులతో పాటు మెజారిటీ వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన కూటమి… లెక్కింపులోనూ అదే జోరు చూపించింది. చివరికి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల లాంటి కంచుకోటలోనూ కూటమి భారీగా వార్డులు, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీకి గట్టి షాక్ ఇచ్చింది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది. కుప్పం మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులనూ టీడీపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. గతంలో కుప్పంలో గెలిచామని గొప్పలు చెప్పుకున్న వైసీపీకి… ఈసారి ఒక్కటంటే ఒక్క వార్డు కూడా దక్కని పరిస్థితి ఎదురైంది. చంద్రబాబు వ్యూహాల ముందు జగన్ మార్క్ రాజకీయం ఘోరంగా విఫలమైంది.
ఒక్క మాటలో చెప్పాలంటే… స్థానిక సంస్థల పోరులో చంద్రబాబు దెబ్బకు సొంత ప్రాంతంలోనే జగన్ కకావికలమయ్యారు. కూటమి సీనియర్ నేతల సమన్వయం, పవన్ కళ్యాణ్ మద్దతు, బీజేపీ కూటమి బలం రాయలసీమ వ్యాప్తంగా కూటమికి ‘రాయల్’ విజయాన్ని అందించాయి. నిన్నటివరకు తమకు తిరుగులేదనుకున్న వైసీపీకి ఈ ఫలితాలు పెద్ద మింగుడుపడని నిజంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో నమోదైన ఈ విజయం.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.











