(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా పలాసలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద ఈ రోజు టీడీపీ నిరసనకు పిలుపునిచ్చింది. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామని మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఈ మేరకు నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని నిమ్మడలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అచెన్నకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లు తెలిసింది.
అచ్చెన్న నిరసన
తెలుగుదేశం నాయకులను, తనని గృహ నిర్బంధం చేయడం పట్ల అచెన్ననిరసన వ్యక్తం చేశారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ ఆయన నినాదాలు చేశారు. ఇంటి చుట్టూ భారీ ఎత్తున మోహరించిన పోలీసులు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. మరో పక్క పలాస టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషను హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన రవి కుమార్, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు ప్రకటించారు.
Must Read ;- పేరుకే అధికార పార్టీ.. ఆఫీసు అద్దెకు డబ్బుల్లేవ్!