(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, అటువంటి పార్టీలో ఉన్న కొంతమంది మాజీలు టీడీపీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతపై పరోక్షంగా విమర్శించారు. సొంత పార్టీలోనే కొంతమంది మాజీలు టీడీపీ కి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు కలిసి పనిచేసిన వ్యక్తులే…ఇప్పుడు వ్యతిరేకులుగా తయారయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అన్న నందమూరి అన్నట్లు… ఆంగ్ల అక్షర మాలలో ఉన్న ప్రతి అక్షరానికి ఒక కాంగ్రెస్ పార్టీ తయారవుతుందని… అలా పుట్టుకొచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వడానికే…కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పార్టీ టీడీపీయని, బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ టీడీపీయని స్పష్టం చేశారు. ఇటువంటి మాజీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడరని సుస్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, విజయనగరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- కార్యకర్తలే టీడీపీకి బలం : పార్టీ 40 ఏళ్ల ప్రస్థానంపై లోకేశ్ లేఖ