వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్కారీ నిర్ణయాలను చాలా గుట్టుగా ఉంచుతున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. క్రమంగా ఈ ఆరోపణలు నిజమేనన్నట్లుగా కీలక అంశాలకు సంబంధించిన జీవోలను జగన్ సర్కారు.. అర్ధరాత్రి వేళ విడుదల చేయడం మొదలెట్టింది. అంటే.. ఆయా నిర్ణయాలపై మీడియా వ్యతిరేక కథనాలు రాయకుండా ఉండేలా వ్యూహం రచించారన్న మాట. ఈ తరహాలో జీవోల జారీ గతంలోనూ ఉన్నా.. కొన్ని రహస్య విషయాలకు సంబంధించి జీవోలను బయటకు విడుదల కాకుండా జారీ చేసే పద్దతి అందరికీ తెలిసిందే. రక్షణ, సైనిక, పోలీసు ఆపరేషన్లు, ఉగ్రవాద నిరోధక చర్యలకు సంబంధించిన జీవోలను ఇలాగే రహస్య జీవోలుగానే పరిగణిస్తారు. ఇక మిగిలిన ఏ అంశానికి చెందిన జీవో అయినా జనానికి తెలిసేలా విడుదల చేయాల్సిందే. అయితే జగన్ సర్కారు మాత్రం ప్రతి అంశానికి సంబంధించి ఉత్తర్వులను రహస్య జీవోలుగానే పరిగణిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కొత్త రకం జీవోలట
ఈ తరహా పరిస్థితిపై విపక్ష టీడీపీ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మీడియా సంస్థలు కూడా అర్ధరాత్రి జీవోల వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు రాస్తున్నాయి. తాజాగా జగన్ సర్కారు విధానపరమైన నిర్ణయాలను తనదైన శైలిలో తూర్పారబడుతున్న టీడీపీకి చెందిన కీలక నేత, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం జగన్ సర్కారు జీవోల జారీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. అర్ధరాత్రి జీవోలు, రహస్య జీవోలను ఇప్పటిదాకా విడుదల చేసిన జగన్ సర్కారు.. తాజాగా ఖాళీ పేపర్లతో కూడిన జీవోలను విడుదల చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జీవో నెంబర్లు మాత్రమే వేసి.. అందులో పేర్కొనాల్సిన అంశాన్ని రాయకుండా జీవోలు విడుదల చేస్తున్నారని, ఆయా నిర్ణయాలపై తర్వాత తీరికగా.. అంశాలను జీవోల్లో రాసే సంస్కృతికి జగన్ సర్కారు శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు.
అంతా ఇష్టారాజ్యమే
అయినా ఏదేనీ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి ఆయా అంశాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగేలా జీవోలను జారీ చేయాలని చట్టం చెబుతోంది. కోర్టులు కూడా ఇదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాయి. అంతేకాకుండా జీవోలను మాతృభాషల్లో విడుదల చేస్తే జనానికి మరింత మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. ఇవేవీ పట్టని జగన్ సర్కారు.. ఖాళీ పేపర్లతో జీవోలను విడుదల చేస్తోందని కొమ్మారెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏ అంశంపై అయినా తనదైన శైలి స్పష్టతతో మీడియా ముందుకు వస్తున్న కొమ్మారెడ్డి.. జగన్ సర్కారు ఖాళీ పేపర్లతో జీవోలను విడుదల చేస్తున్న వైనాన్ని బయటపెట్టడం చూస్తుంటే.. ఈ విషయం నిజమేనేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.