అమ్మ ఒడి పథకాన్ని తన పేటెంట్‌లా భావిస్తుంటారు వైసీపీ అధినేత జగన్. పిల్లలకు మేనమామగా తనకు తానే చెప్పుకుంటారు. ఐతే వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకంలో దాదాపు రూ.26 వేల కోట్ల నిధులకు ఎగనామం పెట్టారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ఇందుకు సంబంధించి లెక్కలతో సహా వివరించారు.
2019 ఎన్నికల్లో జగన్, ఆయన భార్య భారతీ ఇచ్చిన హామీ ప్రకారం అమ్మఒడిని ప్రతి బిడ్డకు అమలు చేస్తే ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేయాల్సిందన్నారు. కానీ, జగన్ ఐదేళ్ల పాలనలో ఇచ్చింది రూ.23,877 కోట్లు మాత్రమేనన్నారు పట్టాభి. జగన్ హయాంలో ప్రతియేటా లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారని లెక్కలతో సహా వివరించారు. 2021లో 44.48 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2023కి ఆ సంఖ్య 42.61 లక్షలకు పడిపోయిందని చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది లబ్ధిదారులకు తల్లికి వందనం పథకంఅమలు చేస్తుంటే వైసీపీవారు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
జగన్ ఐదేళ్లలో రూ.23,877 కోట్లు ఇస్తే, కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదే రూ.10,090 కోట్లు ఇస్తోందన్నారు పట్టాభి. ప్రజలు సంతోషంగా ఉంటే జగన్‌కు పట్టదని..అందుకే ఆయన్ను సైకో జగన్ అంటారని సెటైర్లు వేశారు. హుందాతనం జగన్ డీఎన్‌ఏలోనే లేదన్నారు. కాగా, ఎన్నికల ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు నొక్కేసి, తన వారికి కాంట్రాక్టు బిల్లులు విడుదల చేసుకున్న ఘనత జగన్‌దని, అలాంటి వ్యక్తికి తల్లికి వందనం గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.











