TDP MLA Kinjarapu Atchannaidu Attends Assembly Privilege Committee Hearing :
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు అదే జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌లపై ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ రెండు దఫాలుగా భేటీ అయిన కమిటీ పిలుపునకు అటు అచ్చెన్న నుంచే కాకుండా ఇటు కూన నుంచి కూడా సానుకూల స్పందన రాలేదు. తీరా మూడో విడత కమిటీ భేటీ కాగా.. మంగళవారం నాడు అచ్చెన్న విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను స్పీకర్ తమ్మినేనితో పాటు వేరే ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అచ్చెన్న వివరణ ఇచ్చారు. అచ్చెన్న వివరణ తీసుకున్న వెంటనే భేటీ ముగిసిందని కమిటీ చైర్మన్ కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రకటించారు.
ప్రివిలేజ్ విచారణకు లాయరేల?
ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి ప్రివిలేజ్ కమిటీ విచారణకు హాజరైన అచ్చెన్నాయుడు తన వెంట తన న్యాయవాదిని తీసుకెళ్లారట. అయితే ఈ విచారణకు న్యాయవాదిని అనుమతించేది లేదని అచ్చెన్నకు కాకాణి తేల్చి చెప్పేశారట. దీంతో న్యాయవాదిని బయటకు పంపిన అచ్చెన్న తానొక్కరే విచారణకు హాజరయ్యారు. అయినా పోలీసుల విచారణకో, సీబీఐ విచారణకో, లేదంటే.. ఇతరత్రా దర్యాప్తు సంస్థల విచారణకో లాయర్లను తీసుకెళతారు గానీ.. ప్రివిలేజ్ కమిటీ విచారణకు కూడా న్యాయవాదులను వెంటబెట్టుకుని వెళ్లడం ఎక్కడా చూడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణలో అయితే థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్ లాంటివి ఉంటాయన్న భయంతోనే లాయర్లను వెంటబెట్టుకెళ్లేందుకు కోర్టులు కూడా అనుమతిస్తున్నాయి. అయితే సాటి ఎమ్మెల్యేల నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీ విచారణకు లాయర్ ను వెంటేసుకుని వెళ్లిన అచ్చెన్న తీరుపై సెటైర్లు పడిపోతున్నాయి.
కూనపై చర్యల ఊసే లేదే
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేని కూన రవికుమార్ ఉద్దేశపూర్వకంగానే ప్రివిలేజ్ కమిటీ విచారణకు డుమ్మా కొట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కనీసం విచారణకు హాజరు కాలేనని సమాచారం కూడా ఇవ్వకుండానే కూన గైర్హాజరవుతున్నారు. ఈ క్రమంలో కూనపై మంగళవారం నాటి సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని కాకాణి గోవర్ధన్ రెడ్డి గత భేటీ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటి భేటీలో అచ్చెన్న విచారణకు హాజరు కావడం, తానెవరినీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని చెప్పడంతో.. అచ్చెన్నపై దాదాపుగా చర్యలు లేనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మంగళవారం నాటి విచారణకు కూడా హాజరుకాని కూన రవికుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కాకాణి వెల్లడించకపోవడం గమనార్హం.










