(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్మ పరిరక్షణ దీక్షలు నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లో నిర్వహించిన దీక్షల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నవారిని వెంటనే పట్టుకోవాలని, ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో చేపట్టిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఇతర తెదేపా నాయకులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులతో భయపెట్టలేరు : ఎంపీ
అక్రమ అరెస్టులతో తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను భయపెట్టలేరని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సంతబొమ్మాళిలోని నంది విగ్రహం వివాదంలో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైనవారిని ఎంపీ కలిశారు. అనంతరం కోటబొమ్మాళి మండల తెదేపా అధ్యక్షుడు బోయిన రమేష్ ఇంటికి ఎంపీ వెళ్లి మాట్లాడారు. భయపెట్టాలని చూస్తే కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఎంపీ పునరుద్ఘాటించారు. సంతబొమ్మాళిలోని నాయకులను కూడా పరామర్శించారు. ఎంపీ వెంట టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, కింజరాపు సురేష్ తదితరులు ఉన్నారు.
సీబీసీఐడీ విచారణ జరపాలి : మందకృష్ణ మాదిగ
రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం వంటివి కుట్రపూరితంగా జరుగుతున్నాయని, వీటిపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో జిల్లాస్థాయి ఎమ్మార్పీఎస్, ఎంఈఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
పవిత్ర స్థలాల పరిరక్షణ బాధ్యత అందరిది: ఎస్పీ
దేవాలయాలతో పాటు పవిత్రస్థలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్ అన్నారు. ఎచ్చెర్ల మండలంలోని కుశాలపురం పంచాయతీ పరిధిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జిల్లా స్థాయి గ్రామ రక్షణదళ సభ్యులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఆలయాల భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గ్రామస్థులు, సచివాలయ మహిళా పోలీసులు, వాలంటీర్లు, ఆలయకమిటీ సభ్యుల భాగస్వామ్యంతో గ్రామరక్షణదళాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ దళం పోలీసు వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో మూడు ఆలయాల విగ్రహాల ధ్వంసం ఘటనలకు సంబంధించి మూడు కేసులు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా గ్రామరక్షణ దళం సభ్యులకు తెల్లరంగు టీ షర్టులు పంపిణీ చేశారు. విశ్రాంత ఆడిట్ అధికారి వి.భార్గవప్రసాద్, వి.జగన్నాధంనాయుడు, అడిషినల్ ఎస్పీలు విఠలేశ్వరరావు, సోమశేఖర్, డీఎస్పీ మహేంద్ర, సీఐలు, ఎస్సైలు, గ్రామ రక్షణదళం సభ్యులు పాల్గొన్నారు.