ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయం సహా పలు జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాలయాలు, పార్టీ కీలక నేతల ఇళ్లపై మంగళవారం జరిగిన దాడులపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. ఈ క్రమంలో పార్టీకి చెందిన కీలక నేతలను పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచితే.. పార్టీ శ్రేణులు మాత్రం పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ రోడ్డెక్కాయి. పార్టీ కీలక నేతలను రోడ్డెక్కకుండా అడ్డుకున్నామని సంబరపడ్డ పోలీసులకు టీడీపీ శ్రేణులు చుక్కలు చూపించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీల కార్యకర్తలు వైసీపీ దాడులను నిరసిస్తూ.. పోలీసుల ఆంక్షలను పటాపంచలు చేస్తూ నిరసనలను కొనసాగించాయి.
క్షతగాత్రులనే అడ్దుకుని..
మంగళవారం నాటి వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డ సంగతి తెలిసిందే. క్షతగాత్రులను వెనువెంటనే ఆసుపత్రికి తరలించిన టీడీపీ నేతలు.. వారికి చికిత్సలు చేయించారు. బుధవారం క్షతగాత్రులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ కాగా.. వారిని టీడీపీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చేందుకు నేతలు యత్నించారు. అయితే క్షతగాత్రులన్న కనికరం కూడా లేకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కాలి నడకన బాధితులు ఉన్న వాహనం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో లోకేశ్ ను కూడా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన లోకేశ్.. పోలీసుల తీరును నిరసిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మూకల దాడిలో గాయపడ్డ వారిని కూడా అడ్డుకుంటారా? అంటూ లోకేశ్ విరుచుకుపడటంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. అయినా కూడా లోకేశ్ ను ముందుకు కదలనీయకుండా పోలీసులు తమదైన శైలి అడ్డగింతలకు తెర తీశారు. అయితే మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్.. పోలీసులపైకి దూసుకెళ్లారు. ఇక్కడి నుంచి తప్పుకోవాల్సిందే.. తప్పుకోక తప్పదు.. పక్కకు తప్పుకోండి.. అంటూ కేకలు వేయడంతో పోలీసులు తప్పుకోక తప్పలేదు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కిమిడి నాగార్జున గర్జన
ఇదిలా ఉండగా.. రాష్ట్ర బంద్‌లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించాయి. పార్టీకి చెందిన కీలక నేతలు అందుబాటులో లేకున్నా కూడా టీడీపీ ఉరిమే ఉత్సాహంతో వైసీపీ దాడులను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాయి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. కిమిడి నాగార్జున ఆయన అనుచరులను ఆయన ఇంటి ఆవరణలోనే నిలిపేసిన పోలీసులు.. నాగార్జునను కూడా గృహ నిర్బంధంలో ఉంచే యత్నం చేశారు. అయితే పోలీసుల వైఖరిపై నిప్పులు చెరిగిన నాగార్జున.. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ సీనియర్లు అశోక్ గజపతి రాజు, కిమిడి కళా వెంకట్రావు, పార్టీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్‌లను విమర్శిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా మంగళగిరిలో ఉన్న తమ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగితే సహించేది లేదని, ఈ ఘటనపై తప్పకుండా నిరసన తెలిపి తీరతామని తెగేసి చెప్పారు. అయినా కూడా పోలీసులు అడ్డు తప్పుకోకపోవడంతో నాగార్జున తన ఇంటి ప్రహరి గోడను ఎక్కి దూకి నిరసనలో పాలుపంచుకున్నారు. నాగార్జున వెంట వందలాది మంది పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులు చేతులు ఎత్తేయక తప్పలేదు.