వైసీపీ పాలనలో ఏపీలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదిలో ఈ తరహా అక్రమాలు బయటకు రాకున్నా.. జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో వాటిలో ఒక్కటొక్కటిగానే బయటకు వస్తున్నాయి. ఇలాంటి అక్రమాల్లో గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోనూ ఓ భారీ భూ దందా ఒకటిగా చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం, అదే సమయంలో తన పార్టీ కూడా అధికారంలోకి రావడంతో బొల్లా తనదైన శైలి అక్రమాలకు తెర తీశారు. అంతేకాకుండా తన అక్రమాలు బయటకు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ.. సొంత పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన బొల్లా.. తనదైన మార్కు వ్యూహాన్ని అమలు చేశారు. అయితే అక్రమాలు ఎలాంటివైనా ఎంతోకాలం వెలుగులోకి రాకుండా ఉండవు కదా. ఈ క్రమంలోనే వినుకొండ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇప్పుడు బొల్లా భూ దందాను ఆధారాలతో సహా బయటపెట్టేశారు.
అసైన్డ్కూ పాస్ బుక్కులు
వినుకొండ నియోజకవర్గ పరిధిలోని బొల్లాపల్లిలోని భూములను కేంద్రంగా చేసుకుని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు పాల్పడ్డారట. ఇందులో భాగంగా బొల్లాపల్లిలోని అసైన్డ్ భూములకు కూడా పాస్ బుక్కులు ఇప్పించేసిన ఎమ్మెల్యే.. స్థానిక తహశీల్దార్‌ను అడ్డం పెట్టుకుని ఈ దందాను నడిపించారట. ఒక్కో పాస్ పుస్తకానికి రూ.10 వేల చొప్పున ఏకంగా 7 వేలకు పైగా పాస్ బుక్కులు ఇప్పించేశారట. ఇలా పాస్ బుక్కుల మీదకు ఎక్కిన భూముల్లో చుక్కల భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయట. ఈ మొత్తం భూములను తనకు కావలసిన వారి పేర్లపైకి మార్చేసి వాటికి పాస్ బుక్కులు కూడా ఇప్పించేశారట. అంతేకాకుండా ఇవే పాస్ బుక్కులను బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా ఇప్పించేశారట. ఈ రుణాల్లో మెజారిటీ భాగాన్ని బొల్లా తన జేబుల్లో వేసుకున్నారట. ఈ మొత్తం వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు హీనపక్షం రూ.10 కోట్లకు పైగా వెనకుసుకున్నారట. ఆ పని పూర్తి కాగానే.. బొల్లాపల్లి పరిధిలోని అటవీ భూములకు కూడా బొల్లా పాస్ పుస్తకాలు ఇప్పించేసుకున్నారట. ఇవే భూములను కేంద్రంగా చేసుకుని విపక్షంలో ఉండగా.. ఈ భూములన్నింటినీ పేదలకు హక్కు పత్రాలు ఇప్పిస్తామని బొల్లా చెప్పిన వైనాన్ని గుర్తు చేస్తూ జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే
అసైన్డ్ భూములను ఆసరా చేసుకుని అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్పడిన అవినీతి దందాపై సీబీఐ చేత విచారణ చేయించాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు వినుకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొల్లా అవినీతి దందాకు సంబంధించి ఆధారాలను జీవీ ఆంజనేయులు బయటపెట్టారు. సీబీఐ దర్యాప్తు జరిగితే బొల్లాకు సంబంధించిన మరిన్ని మేర అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయని జీవీ ఆరోపించారు. అసైన్డ్ భూములను పేదలకు కాకుండా తనకు అనుకూలంగా ఉన్న వారి పేరిట రాయించుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బొల్లాపల్లి లో తిరిగే పరిస్థితి లేదని జీవీ హెచ్చరించారు.పేద రైతుల దగ్గర పాసు పుస్తకాలకు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఎమ్మెల్యే బొల్లాను చొక్కా ఊడదీసి కొడతారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో సెంటు భూమి ఇచ్చి పేదలను దగా వైసీపీ చేశారని జీవీ విమర్శించారు. ఈ భూ పంపిణీలో కూడా ఎమ్మెల్యే బొల్లా రూ.18 కోట్లు కాజేశారని సంచలన ఆరోపణలు చేశారు. బొల్లాపల్లి భూ అక్రమాలపై ఎమ్మెల్యే బొల్లా పై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. మొత్తంగా బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి దందాను జీవీ వెలుగులోకి తీసుకుని వచ్చిన నేపథ్యంలో వినుకొండలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.