పేదలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదన్న గొప్ప సంకల్పంతో 2014-19 మధ్య నాటి TDP ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. రూ.40 లక్షల వ్యయంతో అత్యాధునిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, ఫ్యాన్లతో కూడిన భవనాలను నిర్మించింది. రోజుకు కేవలం రూ.5 ఖర్చుతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ లక్షలాది మంది నిరుపేదల ఆకలి తీర్చింది. తొలిదశలో 2018 జులై 11న విజయవాడ భవానీపురంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తొలి క్యాంటీన్‌ను ప్రారంభించగా, 2019 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా వీటి సంఖ్యను 183కి పెంచారు.
టీడీపీ పాలనలో రూ.132 కోట్లు వెచ్చించి 10 నెలల వ్యవధిలోనే ఏకంగా 5.16 కోట్ల భోజనాలను పేదలకు వడ్డించారు. రోజుకు సగటున 1.83 లక్షల మందికి పట్టిన ఆకలి కేకలను ఈ క్యాంటీన్లు తీర్చాయి. భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించడంతో సామాన్యులకు అన్న క్యాంటీన్లు కొండంత అండగా నిలిచాయి. పరిశ్రమల కార్మికులు, ఆస్పత్రుల వద్ద ఉండే బాధితుల బంధువులు, రోజువారీ శ్రమజీవులు ఎందరో ఈ పథకంతో ఆకలి బాధల నుంచి ఉపశమనం పొందారు.
అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల అన్నం ముద్దపైనా కక్షసాధింపు రాజకీయాలను ప్రదర్శించింది. ఆగస్టు 2019తో ఆహార సరఫరా ఒప్పందం ముగియడమే ఆలస్యం..ఉన్నపళంగా అన్న క్యాంటీన్లన్నింటినీ మూసివేసి పేదల కడుపు కొట్టింది. టీడీపీ ముద్ర ఉందనే నెపంతో లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాల రంగులు మార్చడం, తాళాలు వేసి పాడుబెట్టడం చేసింది. కొన్నిచోట్ల భవనాలను కూల్చేయగా, మరికొన్నిచోట్ల వార్డు సచివాలయాలుగా మార్చేసింది. ఉదాహరణకు కడప పురపాలక సంఘం వద్ద ఉన్న క్యాంటీన్‌ను పూర్తిగా కూల్చేస్తే, విజయవాడ రాణిగారితోట క్యాంటీన్‌ను సచివాలయంగా మార్చారు. వెంకటగిరి, ఉండవల్లి లాంటి ప్రాంతాల్లోని క్యాంటీన్లను చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలకు నిలయాలుగా మార్చి ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది.
2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. పాడైపోయిన భవనాలన్నింటికీ యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, 2024 ఆగస్టు 15న తొలి విడతలో 100, ఆ తర్వాత సెప్టెంబర్ నాటికి 203 క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తూ మొత్తంగా 273 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. నిర్వహణ కోసం ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేసి, ఏడాదికి రూ.200 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున 2.73 లక్షల మందికి పైగా ఆకలి తీరుస్తూ, మొత్తం 12.65 కోట్ల భోజనాలు అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్నాయి. పేదల పట్ల టీడీపీకి ఉన్న మానవత్వానికి, వైసీపీ ప్రదర్శించిన అక్కసుకూ మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు.











