తెలుగు రాష్ట్రాల్లో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి తెలుగు దేశం పార్టీ కూడా దిగనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను కూడా జారీ చేసింది. అసలు ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియకున్నా.. అటు ఈటలను ముందు పెట్టుకుని బీజేపీ, ఇటు టీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికపై దృష్టి సారించింది. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జనలు పడుతున్న హస్తం పార్టీ నేడో, రేపో బరిలోకి దిగే నేతను ప్రకటించనుంది. ఇక ఈ ఎన్నికపై మరింత మేర ఆసక్తి రేకెత్తిస్తూ తెలుగు దేశం పార్టీ కూడా బరిలోకి దిగనుంది. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి జోజిరెడ్డి బుధవారం నాడు సంచలన ప్రకటన చేశారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులతో చర్చించిన తర్వాత పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అభ్యర్థిని ప్రకటిస్తారు.
టీడీపీ బలమేంటంటే..?
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీ హవా తగ్గిందని అంతా భావించారు. అయితే నేతలను టీఆర్ఎస్ పార్టీ లాగేసినా.. కేడర్ మాత్రం ఎక్కడికీ పోలేదు టీడీపీ వెంటే ఉన్నారు. అసలు క్షేత్రస్థాయిలో టీడీపీకి ఉన్నంత బలం మరే పార్టీకి లేదనే చెప్పాలి. పార్టీ నిర్మాణం జరిగిన తీరుతోనే ఈ తరహా బలం టీడీపీకి మాత్రమే సాధ్యమైంది. నేతలు వెళ్లిపోయినంత మాత్రాన కార్యకర్తలంతా వారితో పాటే వెళ్లిపోరు కదా. ఇతర పార్టీల విషయంలో ఈ తరహా పరిణామం కనిపించకున్నా.. టీడీపీకి మాత్రం క్షేత్రస్థాయిలో ఇప్పటికీ మంచి పట్టే ఉంది. ప్రతి గ్రామంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తలు పదుల సంఖ్యలోనే ఉన్నారు. నేతలకు పదవీ కాంక్షతో పార్టీలు మారుతుంటే.. టీడీపీ కేడర్ మాత్రం ఆ ఆరహా ప్రలోభాలకు లొంగలేదనే చెప్పాలి. ఇక హుజూరాబాద్ లో పార్టీ పరిస్థితి చూస్తే.. ఇక్కడి నుంచే మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీడీపీ టికెట్‌పై వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అప్పుడే ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగానూ కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత టీఆర్ఎస్‌కు కంచుకోటగా మారింది. అయితే నాడు టీడీపీ వెంట నడిచిన కేడర్ అంతా పెద్దిరెడ్డి వెంట వెళ్లలేదు. పెద్దిరెడ్డి టీడీపీని వీడి పలు పార్టీలు మారి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. అయినా కూడా టీడీపీకి ఈ నియోజకవర్గంలో గట్టి నేత దొరికితే.. సైలెంట్ అయిపోయిన కేడర్ మళ్లీ రీయాక్టివేట్ అవుతుంది. ఇదే జరిగితే.. టీడీపీ విక్టరీ కొట్టడం అంత పెద్ద కష్టమేమీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అన్ని పార్టీలకూ నష్టమే
టీడీపీ పూర్తిగా ఏపీపై ఫోకస్ పెట్టిందన్న వాదనలను వినిపిస్తూ.. తెలంగాణలో ఆ పార్టీని సమూలంగా పారదోలాలన్న దిశగా టీఆర్ఎస్ రచించిన వ్యూహం కొంతమేర వరకు మాత్రమే సక్సెస్ అయ్యింది. నేతలను మాత్రమే లాగేసిన కేసీఆర్.. టీడీపీ కేడర్ ను మాత్రం రాబట్టలేకపోయారు. వెరసి ఒక్క హుజూరాబాద్‌లోనే కాకుండా యావత్తు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి గట్టి కేడరే ఉంది. ఈ కేడర్‌ను టీడీపీ సద్వినియోగం చేసుకుంటే.. హుజూరాబాద్‌లో ఏ ఒక్కరూ ఊహించని ఫలితం ఖాయమేనని చెప్పక తప్పదు. అదే సమయంలో గెలుపు కోసం అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ, మధ్యలో కాంగ్రెస్ పార్టీలు పోట్లాడుకుంటే.. చడీచప్పుడు లేకుండానే టీడీపీ విన్నర్ గా నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. హోరాహోరీగా సాగనున్న హుజూరాబాద్ బైపోల్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా.. చిన్న మార్జిన్ మెజారిటీ మాత్రమే వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ అభ్యర్థికి పడే ఓట్లు విజేతను నిర్ణయించడంలో అత్యంత కీలకమని చెప్పాలి. అదే సమయంలో పార్టీ అభ్యర్థిగా పెద్ద పెద్ద నేతలు లేకున్నా.. జనం నోళ్లలో నానుతూ జనంతో మమేకమవుతున్న నేతను ప్రకటిస్తే.. టీడీపీ సత్తా చాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి.
Must Read ;- బైపోల్ షెడ్యూల్ రెడీ.. అక్టోబర్ 30న పోలింగ్