చెపాక్.. తొలిటెస్టులో టీమిండియాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. కోలుకోలేని పరాభవాన్ని మూటగట్టింది. అదే స్టేడియంలో రెండు టెస్టు ఇవాళ ప్రారంభమైంది. ఈసారి పరిస్థితి టీమిండియాకు అనుకూలించింది. టాస్ గెలవడంతో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత కాస్త తడబడినా.. రోహిత్ శర్మ రూపంలో తొలిరోజు ఆటలో అప్పర్ హ్యాండ్ సాధించింది. హిట్ మ్యాన్ పవర్ ప్యాక్ సెంచరీ పుణ్యమా అని… భారత్ పటిష్టమైన స్థితిలో ఉంది.
ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(161; 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లు), అజ్యింకా రహానే(67; 149 బంతుల్లో 9ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఈ జోడీ 162 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా తిరిగి తేరుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తరుణంలో రోహిత్-రహానేల జోడి ఆదుకుంది.
ఆచితూచి ఆడుతున్న పంత్, పటేల్..
మూడో సెషన్లో ఓ వైపు రోహిత్, మరోవైపు అజింక్య కాస్త దూకుడు పెంచారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదడంతో రన్రేట్ బాగా పెరిగింది. ఈ క్రమంలో 150 పరుగులు చేసి.. ద్విశతకం దిశగా సాగుతున్న హిట్మ్యాన్ ఓ షాట్ ఆడబోయి జాక్లీచ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 162 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. నిలకడగా ఆడుతున్న రహానె కూడా మొయిన్ అలీ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్(13) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన పంత్, అక్షర్ పటేల్ జోడీ.. స్కోరును 300 దాటించింది.
స్పిన్‌లో కోహ్లీ తొలిసారిగా డకౌట్..
టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా మొయిన్ అలీ వేసిన 22 ఓవర్ రెండో బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యారు. బంతిని కోహ్లి అంచనా వేసే లోపే అది గింగిరాలు తిరుగుతూ వికెట్లపైకి దూసుకు పోయింది. ఆ బంతికి కోహ్లి సైతం షాక్‌కు గురయ్యారు. అసలు బంతి వికెట్లను తాకిందా.. లేక కీపర్ చేతులు తగిలి వికెట్లుపడ్డాయా అనే సందిగ్థత కోహ్లి ముఖంలో కనబడింది. కానీ అది క్లియర్ ఔట్ కావడంతో కోహ‍్లి పెవిలియన్ చేరక తప్పలేదు. అయితే మొయిన్ ఖాతాలో ఒక అరుదైన రికార్డు చేరింది. టెస్టుల్లో కోహ్లిని డకౌట్ చేసిన తొలి స్పిన్నర్‌గా మొయిన్ రికార్డు సాధించారు. టెస్టుల్లో ఇప్పటివరకూ కోహ్లి 11సార్లు డకౌట్ కాగా స్పిన్నర్‌కు డకౌట్ కావడం ఇదే తొలిసారి.