(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
నిన్నమొన్నటి వరకు ఒక లెక్క .. నేడు మరో లెక్క అంటూ గేర్ మార్చి స్పీడ్ పెంచారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో ప్రొటోకాల్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైసీపీకి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. గతంలో కొంత పట్టించుకోక పోయినా, ఇప్పుడు అధికారులతో సమీక్షలు, భేటీలు, ప్రొటోకాల్ దేన్నీ విడిచిపెట్టడం లేదట. దాంతో జిల్లాలోని అధికారుల పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం .. విడవమంటే పాముకు క్రోధం’ అన్న చందంగా మారిందట.
Also Read:-అచ్చెన్నాయుడుకు బంపర్ ఆఫర్
ఆధిపత్య పోరు
2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ గాలిని తట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేలుగా టెక్కలి నుండి అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం నుండి బెందాళం అశోక్ గెలుపొందారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు పెద్దయెత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ రగడలు కూడా తెరమీదకు వస్తున్నాయి. గత ఏడాదిన్నరగా ఇదే సమస్య కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులదే అంతా పెత్తనం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గతంలో రోడ్డెక్కి సైతం ఆందోళన చేశారు. దీని వల్ల ఆశించిన ఫలితం కనిపించక పోవడంతో ఆయన సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అచ్చెన్నాయుడు కొత్తలో ఇలాంటి ఇబ్బందులను పెద్దగా పట్టించుకోలేదని, ఇప్పుడు దేన్నీ వదలడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read:-ఎవరి పంతం నెగ్గుతుందో..?
రూటు మార్చిన అచ్చెన్న
టెక్కలిలో పట్టు సాధించేందుకు వైసీపీ అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ నేరుగా అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నట్లు భోగట్టా. పాలన అంతా తన కనుసన్నల్లో జరిగేటట్లు చూసుకుంటున్నట్టు సమాచారం. ఇంతలో అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయి జైలుకు వెళ్లడంతో తమదే రాజ్యమని భావించారట వైసీపీ నాయకులు. జైలు నుంచి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు తన పంథా మార్చేశారు. దానికి తోడు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో ఇంకా స్పీడ్ పెంచారు. తన క్యాంపు కార్యాలయం నిమ్మాడలో అచ్చెన్న అధికారులతో ఇటీవల వరుస సమీక్షలు నిర్వహించారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న దువ్వాడ శ్రీనివాస్ సమీక్షకు వెళ్లిన అధికారులను పిలిచి క్లాస్ తీసుకున్నట్లు భోగట్టా. ఈ నేపథ్యంలో అధికారులు అడకత్తెరలో పోకల్లగా మారుతుండటం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
అసెంబ్లీ ప్రొటోకాల్ కార్యదర్శికి ఫిర్యాదు
ఈ సంఘటనలను సీరియస్‌గా తీసుకున్న అచ్చెన్న టెక్కలిలో ప్రొటోకాల్ పాటించడం లేదని తొలుత శ్రీకాకుళం కలెక్టర్ ను, తరువాత నేరుగా అసెంబ్లీ ప్రొటోకాల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఇటీవల టెక్కలిలో నిర్వహించిన రైతు భరోసా, సచివాలయాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు తనను పిలవలేదని ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన అందజేశారని సంబంధిత వర్గాల సమాచారం. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్‌కు అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి బాల సుబ్రమణ్యంరెడ్డి లేఖ రాసినట్లు సమాచారం. ఆ లేఖ అందుకున్న వెంటనే ఈ విషయంపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారని తెలిసింది. ఈ పరిణామాలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారి పెద్దయెత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Must Read:-టీడీపీలో రగులుతున్న కాపు కుంపటి











