కొన్ని చట్టాలను సవరణ చేసేందుకు తెలంగాణ శాసనసభ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అయింది. జిహెచ్ఎంసి చట్టసవరణ బిల్లును పురపాలకశాఖ మంత్రి కేటిఆర్ సభలో ప్రవేశపెట్టి, సభ్యులు లెవనెత్తిన ప్రశ్నలకు కూలంకశంగా సమాధానం ఇచ్చారు. కెటిఆర్ వివరణకు సంతృప్తి చెందిన సభ్యులు జిహెచ్ఎంసి చట్టసవరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
సభముందు ఐదు బిల్లులు…
మంగళవారం శాసనసభలో జిహెచ్ఎంసి చట్టసవరణ, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్జేషన్, క్రిమినల్ ప్రొసీజర్ బల్లులపై ప్రధానంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా జిహెచ్ఎంసి చట్టసవరణకు సంబంధించి మంత్రి కేటిఆర్ ఐదు సవరణలు చేస్తున్నట్లు మంగళవారం సభలో ప్రకటించారు. దీనిపై కాసేపు చర్చ జరిగిన తరువాత సభ్యులందరూ జిహెచ్ఎంసి చట్టసవరణలకు ఆమోదం తెలిపారు.
నాడు జీవో.. నేడు చట్టం..
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో జిహెచ్ఎంసి చట్టసవరణ బిల్లు అసెంబ్లీలో చర్చకొచ్చింది. ఈ బిల్లులో ఐదు సవరణలను అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో పోటీచేసే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. 2015లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం విడుదల చేసిన ఓ జీవో ద్వారా ఆ నాడు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని కేటిఆర్ సభలోప్రస్తావించారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చేందుకుగానూ చట్టసవరణను మళ్లీ ఇప్పుడు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
10 శాతం గ్రీన్ బడ్జెట్…
మున్సిపల్ చట్టం, పంచాయతీరాజ్ చట్టం మాదిరిగానే జిహెచ్ఎంసి చట్ట సవరణ కోసం మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 10 శాతం బడ్జెట్‌ను జిహెచ్ఎంసి పరిధిలో గ్రీన్ కవర్ బడ్జెట్‌ను తీసుకొస్తున్నామని కెటిఆర్ ప్రతిపాదనను సభ్యులు ఆమోదం తెలిపారు. హరితహారంలో భాగంగా నగరాన్ని హరిత నగరంగా మార్చేందుకే ఈ సవరణలు సభ ముందు ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు.
డివిజన్‌కు నాలుగు కమిటీలు..
గ్రేటర్‌లో 150 వరకు డివిజన్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి డివిజన్‌కు నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు సభలో ప్రతిపాదించారు. ఇందులో ఒకటి మహిళ కమిటీ, యూత్‌కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ, ఎమినెంట్ సిటీజెన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కోకమిటీలో 25 మంది సభ్యులు ఉంటారన్నారు. వీరంతా స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని మంత్రి తెలిపారు. మూడు నెలలకోసారి రివ్యూ మీటింగ్‌లు కూడా ఉంటాయని తెలిపారు.
ప్రభుత్వాన్ని సంప్రదించాలి..
ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని చట్ట సవరణ చేసినట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ సవరణ రెండు టర్మ్‌లకు వర్తిస్తుందని చెప్పారు. పదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్పునకు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రతి సారి ఎన్నికల రిజర్వేషన్లు మార్చడం వల్ల స్థానికంగా ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉండదని, ఈక్రమంలోనే రెండు పర్యాయాలు ఒకే రిజర్వేషన్లు అమలులో ఉంటాయని తెలిపారు. ఐదు చట్టసవరణలు చేస్తూ జిహెచ్ఎంసి చట్టసవరణ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు.