అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించిన తీరుపై అందరూ మెచ్చుకుంటున్నారు. శెభాష్ పోచారం అని ఆయనకు కితాబిస్తున్నారు. అసెంబ్లీలో కరోనా నిబంధనలు పాటించని మంత్రులు జగదీష్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌పై చురకలు అంటిస్తూ ఆయన వ్యవహరించిన తీరుపై అందరూ ప్రశంసిస్తున్నారు. తమ సొంతపార్టీకి చెందిన సభ్యులైనప్పటికినీ కరోనా నిబంధనలు పాటించే విషయంలో తనకు అందరూ ఒక్కటేనని చెప్పకనే చెప్పారు. సొంతపార్టీ వారే కదానని ఎలాంటి పక్షపాతం చూపకుండా వారు ఎవరైనా సరే సభలో ఖచ్చితంగా కోవిడ్ నిభంధనలు పాటించాల్సిందేనని ఖరాకండిగా తన నిర్ణయాన్ని చెప్పిన విధానం పట్ల ప్రతి ఒక్కరూ ఆయనకు ఫిదా అయిపోయారు.
తెలంగాణ అసెంబ్లీలో మంత్రులకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చురకలు అంటించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిలు సభ నడుస్తున్న సమయంలో కోవిడ్ నిబంధనలను అతిక్రమించడంతో స్పీకర్ వారిని హెచ్చరించారు. సభలో కోవిడ్ నియమాలను, నిబంధనలను పాటించాలని మంత్రులకు ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంపై ఆయన నేరుగానే అసహనం వ్యక్తం చేశారు.
సభా నడుస్తున్న సమయంలో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వచ్చి ఈటెల రాజేందర్ పక్కన ఉన్న నో సీటింగ్ ఛైర్‌లో కూర్చున్నారు. ఇది గమనించిన స్పీకర్ పోచారం నో సీటింగ్ సీట్‌లో కూర్చొద్దని మంతి జగదీష్‌రెడ్డికి సూచించారు. దీంతో వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి అక్కడి నుంచి లేచి తన సీటుకు వెళ్ళిపోయారు. సభలో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఆయనను ఉద్ధేశిస్తూ మందలించారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందని మండిపడ్డారు. సభ్యులందరూ సభలో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సభాముఖంగా సూచించారు. గతంలో కరోనా బారిన పడ్డవారిలో మంత్రులు, ఎంఎల్ఎలు కూడా ఉన్న విషయం తెలిసిందే.
మంత్రుల తీరుపై అసహనం..
కరోనా వ్యా ప్తి కారణంగా అసలు తెలంగాణ వర్షాకాలపు సమావేశాలను నిర్వహించాలా వద్దా? అనే తర్జనభర్జనలనంతరం కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలను తప్పకుండా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దానికి తగినట్లుగానే అసెంబ్లీలో సభ్యునికి సభ్యుని మధ్య వెడం ఉండేలా సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఎంఎల్ఏలు, ఎంఎల్‌సిలు, మంత్రులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతోపాటు మీడియా, ప్రభుత్వ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు జరిపి నెగెటివ్ వచ్చిన వారికే సమావేశాలకు అనుమతినిచ్చారు. ఇలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో అసెంబ్లీలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చనుకున్నారు. మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ సెన్సార్లను సైతం సభలోని సభ్యులకు అందించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంది సభలో సభ్యులు కోవిడ్ నిభంధనలు పాటించకపోతే అని ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రులే కోవిడ్ నిబంధనలు పాటించకపోతే సామాన్యులు ఇక ఎలా పాటిస్తారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.