హఠాత్తుగా కరెంటు పోయినా.. వీధిలో కరెంటు స్తంభం దగ్గర ఏదైనా సమస్య వచ్చినా.. వెంటనే అందరికీ గుర్తోచ్చే వ్యక్తి ‘లైన్ మెన్’. ఇంట్లోని పెద్దవాళ్లు ఆ లైన్ మెన్‌కి ఫోన్ చేసి అడగండి సమస్యేమిటో అని సాధారణంగా అంటుంటారు. దేశంలో మిలిటలీలో సైతం దూసుకుపోతున్న మహిళలకు ‘లైన్ ఉమెన్’ ఉద్యోగాలకు అవకాశం లేదు. చివరకి ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్‌లో కూడా పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంగా ఉంటుంది. అసలే కరెంట్‌తో పని, స్తంభాలు కూడా ఎక్కాల్సి ఉంటుంది. ఇలాంటివి అమ్మాయిలు చేయగలరా అనుకుంటారు కొందరు. అసలెందుకు ఆడవాళ్లకు ఇవ్వరు అనుకునే వారు లేకపోలేదు. అలాంటి ఆలోచనే తెలంగాణ గజ్వేల్ ప్రాంతానికి చెందిన బబ్బురి శిరీషకు కూడా కలిగింది. ఎందుకివ్వరు అనకుంటూ ఊరుకోలేదు శిరీష.. కోర్టుకెల్లి మరీ తన హక్కులను దక్కించుకుంది.
2019లో తెలంగాణ ప్రభుత్వం 534 లైన్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో పురుషులకు మాత్రమే అని నిబంధన ఉంది. ఈ నిబంధనే శిరీషలో సరికొత్త ఆలోచనను రేకెత్తిచింది. ఆడవాళ్లు ఎందుకు లైన్ మెన్ ఉద్యోగాలకు అవకాశాలకు ఇవ్వరు అని ఆలోచించడం మొదలుపెట్టింది. తన ఆలోచనకు మరి కొందరు తోడు కావడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతులతో దరఖాస్తు చేసుకుని ఎగ్జామ్ రాశారు ఆ లేడీస్ అందరూ. కానీ, పురుషులకు సంబంధించిన ఫలితాలు మాత్రమే విడుదల కావడంతో మరోసారి కోర్టును ఆశ్రయించిక తప్పలేదు. చివరికి కోర్టు ఆదేశాలతో ఫలితాలు వెలువరించింది ప్రభుత్వం. తర్వాతైనా అడ్డంకులు తొలిగాయా అంటే లేదు.. కరెంటు స్తంభం ఎక్కే పరీక్ష ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంటుంది. వాటిని ఆడవాళ్లకు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ రావడంతో.. మరోసారి ఆడవాళ్లంతా కోర్టును ఆశ్రయించక తప్పలేదు. కోర్టు జోక్యంతో చివరి పరీక్షలు కూడా నిర్వహించారు. అందులో శిరీష ఉత్తీర్ణత సాధించడంతో.. దేశంలో మొదటి లైన్ ఉమెన్‌గా చరిత్ర సృష్టించారు శిరీష.
Telangana's 1st linewoman : 20 years old Sirisha cracked the junior lineman Exam by TSSPDCL to become 1st linewoman in Telanagana Congratulations Sirisha proud of your accomplishments #womenempowerment @PMOIndia @MinistryWCD @IPRTelangana @PIBHyderabad @airnews_hyd @DDYadagiri
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 2, 2021
అభినందనలు వెల్లువ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ట్వట్టర్ వేదికగా శిరీషని అభినందించారు. తెలంగాణ మొదటి లైన్ ఉమెన్ కు అభినందనలు తెలుపారు. ఇంతటి ఘనత సాధించిన 20 ఏళ్ల శిరీషను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు తమిళిసై.
మరువలేనిది..
దేశంలోనే మొదటి లైన్ ఉమెన్‌గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు శిరీష. గవర్నర్ తమిళిసై తనకు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం మరవలేనిదని చెప్పారు. ఈ ఉద్యోగం సాధించడానికి ఎన్నో సార్లు కోర్టు చుట్లూ తిరగాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా అపాయింట్‌మెంట్ ఇస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.