Telangana Minister Harish Rao Hard Comments On YSR :
తాను బతికుండగా ప్రత్యేక రాష్ట్రం రాబోదని అసెంబ్లీ సాక్షిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తేల్చి చెప్పారు. 100 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటేనే.. తెలంగాణ వస్తుందని అనుచితంగా మాట్లాడారు. మరి అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉంటారా? అంటే ‘నో’ అనే అంటారు తెలంగాణవాళ్లు. రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ మొదలైనప్పట్నంచీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జలవివాదంపై మాట్లాడుతూ.. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక నరరూప రాక్షసుడు’ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ మంత్రులు బాహటంగా వైఎస్ ను ఘోరంగా అవమానిస్తున్నా… వైసీపీ నాయకులు మెతక వైఖరి అవలంబిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో సీనియర్ నాయకుడు, మంత్రి హరీశ్ రావు వైఎస్ రాజశేఖరరెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర తొత్తులకు అవకాశం లేదు
శనివారం మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణను వైఎస్ అవమానించారని, తెలంగాణ గురించి మాట్లాడితే గొంతునొక్కి, అసెంబ్లీ నుంచి బయటకు పంపించారని గుర్తు చేశారు. తెలంగాణ గొంతునొక్కిన నాయకుడి వారసులొస్తున్నారని, ఇక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజకీయ పబ్బం గడుపుకునే ఆంధ్ర తొత్తులకు, అవకాశవాదులకు తెలంగాణ లో స్థానం లేదని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారసులను నమ్మొద్దు
ప్రత్యేక తెలంగాణ ఇవ్వడానికి అదిఏమైనా సిగరెట్టా, బీడీనా అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారని, అలాంటి నాయకుడి వారసులు తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారని, తెలంగాణ ప్రజలు బుధ్ది చెప్పాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయలేనిది కేవలం 7 ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించారని, అందుకే టీఆర్ ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు. అధికారం కోసం కలలు కంటున్న కాంగ్రెస్.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Must Read ;- వైఎస్సార్ కంటే కేసీఆరే బెటరంట