అసలే ఇప్పుడు హుజూరాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. శుక్రవారం ఈ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా జారీ అయిపోయింది. నామినేషన్ల దాఖలు మొదలైపోయింది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఫలితంపై ఇప్పుడు ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఏపీలోనూ పెద్ద చర్చలే నడుస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీగా సాగనున్న ఈ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కినా స్వల్ప మెజారిటీనే దక్కుతుంది. ఈ క్రమంలో ఏ పార్టీ తప్పటగుడు వేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్న మంత్రి తన్నీరు హరీశ్ రావు..హుజూరాబాద్‌ను వదలడం లేదు. బీజేపీ అభ్యర్థిగా భావిస్తున్న ఈటల రాజేందర్‌ను ఓడించే దిశగా హరీశ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే హరీశ్ రావు.. బీజేపీకి సంబంధించి తెలంగాణ శాఖలో కీలక నేతగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ జి.వివేక్‌తో భేటీ అయ్యారట. ఈ భేటీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు తెలంగాణలో వైరల్‌గా మారిపోయాయి.
వివేక్ జంపైతే బీజేపీకి కష్టమే
కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నేత జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వివేక్.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సమయంలో 2009 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వివేక్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న వివేక్.. పార్టీ తెలంగాణ శాఖకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇటీవలే జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచారన్న వాదనలు లేకపోలేదు. తాజాగా కేసీఆద్పై తిరుగుబాటు చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేరేలా వ్యూహం అమలు చేసింది కూడా వివేకే. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైన వేళ.. బీజేపీకి వివేక్ అవసరం చాలానే ఉందని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో వివేక్‌తో హరీశ్ రావు భేటీ కావడం, టీఆర్ఎస్లోకి ఆయనను ఆహ్వానించిన వార్తలు బీజేపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. హరీశ్ వ్యూహం ఫలించి వివేక్ టీఆర్ఎస్ లో చేరితే.. బీజేపీకి భారీ దెబ్బేనని చెప్పాలి.
రాజ్యసభ ఆఫర్ చేశారా?
వివేక్‌తో అత్యంత రహస్యంగా భేటీ అయిన హరీశ్ రావు.. టీఆర్ఎస్లోకి వస్తే రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారట. అంతేకాకుండా రెండున్నరేళ్లుగా బీజేపీలో ఉంటే.. ఆ పార్టీ నుంచి మీకు దక్కిందేమిటని కూడా హరీశ్ ప్రశ్నించారట. బీజేపీ మిమ్మల్ని అన్ని రకాలుగా వాడుకుని వదిలేస్తోందని, తాము అలా కాదని, తమ ఆహ్వానాన్ని మన్నిస్తే.. త్వరలోనే రాజ్యసభకు పంపుతామని వివేక్‌కు ఆఫర్ చేశారట. ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా వీ6 పేరిట కీలక మీడియా సంస్థను నిర్వహిస్తున్న వివేక్‌కు నిజంగానే రాజకీయ పదవులపై బాగానే ఆశ ఉందని చెప్పాలి. ఆర్థికంగా బలంగా ఉన్నా గానీ.. ఏ పార్టీ తనకు దక్కాల్సింనంత గౌరవాన్ని ఇవ్వలేదని కూడా వివేక్ మదనపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో హరీశ్ రావు ఆహ్వానం, ఆఫర్‌పై వివేక్ తీవ్రంగానే ఆలోచన చేసే అవకశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఓ సారి టీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కక అవమానాల పాలైన నేపథ్యంలో తిరిగి అదే పార్టీ చేస్తున్న ఆఫర్‌ను వివేక్ ఎంతవరకు విశ్వసిస్తారన్న వాదనలు లేకపోలేదు. మొత్తంగా వివేక్‌తో హరీశ్ రహస్య భేటీ పెద్ద చర్చలకే తెర తీసిందని చెప్పాలి.
Must Read ;- బరిలోకి టీడీపీ.. ఫలితం తారుమారే