తెలంగాణ మంత్రివర్గం రేపు (శనివారం) సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరగనుంది. ఈనెల 13, 14న అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 13న శాసనసభ, 14న శాసనమండలి సమావేశం కానుంది. కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకుగానూ రెండు రోజుల పాటు సమావేశాలను తెరాస ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన తీరు, చట్టాల సవరణ, వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే యాసంగిలో పంటసాగు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో జిహెచ్ఎంసిలోని కొన్ని చట్టాలను సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ఆర్ఎస్, థరణీ ఆస్తుల వివరాల సేకరణ, హైకోర్టు సూచించిన పలు అంశాలపైన ఈ భేటీలో చర్చించనున్నారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాల్సిన అవసరముంది. ఈక్రమంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయి పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఈ సమావేశాలు అందుకేనా?..
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ. 13, 14వ తేదీల్లో రెండు రోజులు శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఒకవైపు దుబ్బాక ఉపఎన్నిక, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో సెప్టెంబర్ 16న వాయిదాపడిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మళ్లీ ఎందుకు రెండు రోజులు నిర్వహిస్తున్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశాలను నర్వహిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తాయిళాల కోసమే పలు చట్టాల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారని అంతా అనుకుంటున్నారు.
ఈ చట్టాల్లో మార్పులు ఉంటాయా?..
ఎల్ఆర్ఎస్, ధరణీతో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకతలు వస్తున్నాయి. కరోనా సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు లేక పస్తులు ఉంటే ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.లక్షలకు.. లక్షలు పోసి అక్రమ ప్లాట్లను రెగ్యులరైస్ చేసుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అలాగే ధరణీ విషయంలో ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఆస్తుల వివరాలను ఇస్తే ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్, రాయితీలు ఎక్కడ తమకు రావేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఆస్తుల వివరాల విషయంలో కుటుంబ కలహాలు పోలీస్ స్టేషన్లకు చేరుకుంటున్నాయి. ఈనేథ్యంలో అసలు ఆస్తుల వివరాలు ఇవ్వాలా..వద్దా… అని జనం సంకోచిస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఈ వ్యతిరేకత, ఆందోళనకు సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ఈ చట్టంలో ఏమైనా మార్పులు, చేర్పులను ప్రభుత్వం చేయబోతుందెమో అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటుందనే చర్చ సైతం జోరుగా జరుగుతోంది. అలాగే కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపైన కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం.
ముందే ముగించేశారు..
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి 28 వరకు జగరాల్సి ఉంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు కరోనా బారిన పడడంతో ఈ సమావేశాలను సెప్టెంబర్ 16వరకే ముగించేశారు. ఈసమావేశాల్లో మొత్తం 12 బిల్లులు పాసయ్యాయి. ఇందులో ఎనిమిది అసెంబ్లీలో, 4 బిల్లులు మండలిలో పాసయ్యాయి. గ్రేటర్ ఎన్నికలను నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఈక్రమంలో తెలంగాణ కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు, చట్టాల సవరణ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్నికలకు వెళ్లే ముందు కొన్ని కీలకమైన చట్టాలను సవరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రజలు కూడా అనుకుంటున్నారు.