హత్యా రాజకీయాల వారసుడు జగన్ రెడ్డి
హత్యా రాజకీయాలకు వారసుడు జగన్ రెడ్డి అవ్వడం ప్రజలకు, ప్రతిపక్షాలుకు రక్షణలేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యపై లోకేష్ స్పందించారు. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని హత్య చేయడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. చంద్రయ్య హత్యను ఖండిస్తున్నామన్నారు. చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలానే హత్యపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు. రెండున్నరేళ్ల కాలంలో అనేక మంది టీడీపీ కార్యకర్తలను బలికొన్నారని, ఇక వైసీపీ అరాచకాలన్ని సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటమి భయంతోనే హత్యలు..!
వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఫ్యాక్షన్ కు పురుడుపోస్తున్నారని టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, దూళిపాళ్ల నరేంద్ర, కోవెలమూడి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దూర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యేనని మండిపడ్డారు. పిన్నెల్లికి ఓటిమి భయం పట్టుకుందని, సొంతపార్టీ నాయకులే ఆయన చర్యలను ఛీదరించుకునే స్థాయికి ఆయన గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు.











