లేపాక్షి బసవన్న లేచి రంకెవేస్తే ప్రపంచం అంతమైపోతుందని వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. ప్రపంచం అంతమైపోయే సమయానికి లేచి నిలబడి రంకె వేయడానికి అసలు లేపాక్షి బవసన్న మిగిలి ఉంటాడా? అనేదే ఇప్పుడు అనుమానంగా మారుతోంది. బసవన్నకు, లేపాక్షి ఆలయానికి కూడా ముప్పు పొంచి ఉంది.
(అనంతపురం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
విజయనగర పాలన కాలం నాటి కళావైభవం.. ప్రపంచ ఖ్యాతిగాంచిన శిల్పసంపద.. సందర్శకులు కనురెప్పలు వాల్చకుండా తిలకించేంత ఏకశిలతో చెక్కబడిన బసవన్న ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వన్నె తెచ్చే వైభవ చిహ్నాలు. వీరభద్రాలయంలోని రాతిస్తంభాలపై అద్భుత కళానైపుణ్యం అందరూ ఎరిగినదే. శతాబ్దాల చరిత్ర కలిగిన లేపాక్షిలోని అద్భుత శిల్ప సంపద యావత్తూ జాతీయ రహదారి నిర్మాణంతో మసకబారుతుందా? అనే భయం ఇప్పుడు స్థానికుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు పనులు జరుగుతున్న తీరు బట్టి అవుననే అనిపిస్తుంది. ఈ వ్యవహారంలో విపక్షాలు పోరాడుతున్నాయి. ఈ పోరాటాలతో సంరక్షణ జరిగేనా? ఫలితం దక్కుతుందా? అనే భయాలు కూడా కలుగుతున్నాయి. ఇదే లేపాక్షిలోని అన్ని వర్గాల వారి మెదళ్లను సమస్య.
ఐతే ఓవైపు అన్నింటిలోనూ ఒంటెత్తు పోకడతో వెళ్తున్న అధికార పార్టీ నాయకత్వానిదైతే.. మరోవైపు పట్టు పడితే సాధించేదాకా వదలని నైజం కలిగిన ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే బాలక్రిష్ణది. ఆలయాల సంరక్షణ మా బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం పోరాటానికి దిగింది. చివరికి పైచేయి ఎవరిది అవుతుంది.. రోడ్డు పనుల అలైన్ మెంట్ మార్పుతో శిల్పకళ, సంస్కృతి సంరక్షణ జరిగేనా అన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా నెలకొంది.
అధికారం పట్టు వీడి ‘దారి’ మళ్లిస్తుందా?
శోర నుంచి కొడికొండ చెక్ పోస్టు వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అభివృద్ధికి దోహదపడే రహదారులు ఏర్పాటు చేస్తే మంచిదే. అదే సమయంలో పురాతన కట్టడాలు, ఆలయాలు, సంస్కృతి దెబ్బతినకుండా కాపాడుకునే బాధ్యత అధికార యంత్రాంగం, పాలకులదే. లేపాక్షిలో చేపట్టిన రోడ్డుపై తిరిగే వాహనాలతో దుమ్ము ధూళితో వీరభద్రాలయం, నంది విగ్రహాలు విషయాన్ని విస్మరించాయని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 1530 ప్రాంతానికి చెందిన విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళతో 20అడుగుల ఎత్తున, 30అడుగుల పొడవు ఏకశిలతో నంది విగ్రహం, పలు అవతారాలతో దర్శనమిచ్చే వీరభద్రస్వామి ఆలయం ఉన్నాయి. ఆలయంలో నేలపై తాకకుండా ఒక స్తంభం ఉంది. దీని కింద కాగితం, చేతిరుమాలు తీసేలా సందు ఉండటం మహత్తుగా భావిస్తారు.
ఇంతటి మహత్తర మైన ప్రదేశాలను బాధ్యతేమీ పట్టనట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని విమర్శలు ఉన్నాయి. నాలుగు వరుసల రోడ్డు ఏర్పాటుతో నంది, వీరభద్రాలయ ప్రాభవం మసకబారే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి మళ్లించాలన్న డిమాండ్ తో స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళనకు దోగాయి.
నిబంధనలకు విరుద్ధంగా పనులు
పురావస్తు శాఖ నిబంధనల మేరకు జాతీయ రహదారి పనులు చేపట్టారు. అయితే నంది విగ్రహం చుట్టు 500 మీటర్ల మేర ఎలాంటి పనులు చేపట్టకూడదని పురావస్తు శాఖ లిఖిత పూర్వక ఆదేశాలు ఉన్నట్లు భాజపా నాయకులు వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆపార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ముఖ్యమంత్రికి, లేఖ కూడా రాశారు. అయినా ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. స్థానిక భాజపా నాయకులు ఆక్షేపణా ప్రకటనలు, ప్రత్యక్ష పోరాటాలకు దిగారు. రహదారి అడ్డుకుని శిల్పకళ వన్నె తగ్గనీయకుండా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు, గుత్తేదారులు మాత్రం పనుల కొనసాగింపుకే చూస్తున్నారన్న చర్చసాగుతోంది.
ఇందుకు అనుకూలంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాలను నిర్వహించి పూర్వవైభవాన్ని జనానికి చాటారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన జోక్యం అంతగా కనిపించడం లేదు. భాజపా నాయకులు మాత్రం రహదారి అలైన్‌మెంటు మార్పుతో బసవన్న విగ్రహం, వీరభద్రస్వామి ఆలయాల ప్రాభవాన్ని కాపాడేందుకు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే నంది విగ్రహం పరిసరాల్లో రోడ్డు పనుల కోసం తీసిన గుంతలను పూడ్చినట్లు తెలుస్తోంది. అధికారం మనసు మారిందా? అలైన్ మెంటు మార్పుకు ఆదేశాలు అందాయా? ఏం జరుగుతోందో వేచిచూద్దాం.