టెస్లా… ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాటి బ్యాటరీల తయారీ, నిర్వహణ వంటి వ్యవహారాల్లో ప్రపంచంలోనే మేటి సంస్థ. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ సంస్థ భారత్ లో అడుగుపెట్టేందుకు ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉంది. తాను భారత్ కు వస్తే తనకు ఏమేం కావాలన్న అంశాలపై మస్క్ గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అప్పుడెప్పుడో టెస్లా ప్రతిపాదనను తిరస్కరించింది. అయినా కూడా మస్క్ తన యత్నాలను అయితే విరమించలేదు. భారత్ లో అడుగుపెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను సజీవంగానే ఉంచుతూ ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అయితే గ్రీన్, రిన్యూవబుల్ ఎనర్జీల విషయంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ఫ్లైట్ ఎక్కిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్,… టెస్లాను ఏపీకి రప్పించే దిశగా సోమవారం తొలి అడుగు వేశారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్… సోమవారం ఉదయం ఆస్టిన్ లోని టెస్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన టెస్లా సీఎఫ్ఓగా పనిచేస్తున్న వైభవ్ తనేజాతో పలు అంశాలపై సుదీర్ఘ మంతనాలు సాగించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా లోకేశే వెల్లడించారు. తాను టెస్లా కార్యాలయాన్ని సందర్శించానని, తనేజాతో చర్చలు జరిపానని తెలిపిన లోకేశ్… ఏపీలో టెస్లా కార్ల తయారీని, ఈవీ బ్యాటరీల తయారీని మొదలుపెట్టాల్సిందిగా తాను తనేజాను కోరానని తెలిపారు. ఈ ప్రతిపాదనకు తనేజా నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయాన్ని పక్కనపెడితే… ఏపీలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీ ప్లాంటు, దాని పని తీరు, ఆ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించిన సహకారం తదితరాలను టెస్లా ప్రతినిధులకు లోకేశ్ వివరించారు. ఈ చర్యతో టెస్లాను ఏపీకి తీసుకువచ్చేందుకు లోకేశ్ దిగ్విజయంగా తన తొలి అడుగు వేసినట్టేనని చెప్పక తప్పదు.
రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, విండ్ పవర్, సోలార్ పవర్ ల విషయంలో ఏపీలో రాయలసీమ జిల్లాలు అత్యంత అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా రెన్యూవబుల్ ఎనర్జీకి కేంద్రంగా మారిపోతే… అంతకు చాలా ఏళ్ల ముందటే అనంతపురం జిల్లా విండ్, సోలార్ పవర్ లకు కేంద్రంగా మారింది. కరువు పీడిత ప్రాంతాలుగా ముద్రపడిన ఈ జిల్లాలు ఇప్పుడు పారిశ్రామిక రంగంలో ఇతర జిల్లాలకు ధీటుగా పురోభివృద్ధి సాధిస్తున్న తీరు నిజంగా అద్భుతమేనని చెప్పాలి. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తొలిసారి పాలనా పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ జిల్లాల రూపు రూఖలు మారిపోయేలా చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కియా కార్ల తయారీ యూనిట్ అనంతపురం జిల్లాలో ఏర్పాటైంది.
అమెరికా పర్యటనకు ముందే ఢిల్లీలో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన లోకేశ్ ను పలు జాతీయ మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేశాయి. ఈ సందర్భంగా టెస్లా అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. టెస్లాను ఏపీకి రప్పించేందుకు తమవంతు ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతూనే ఉన్నాయని లోకేశ్ చెప్పుకొచ్చారు. సీఎం హోదాలో చంద్రబాబు ఇదివరకే పలుమార్లు ఈ విషయంపై అటు టెస్లా ప్రతినిధులతో పాటుగా ఇటు కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరిపిన విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. తాజాాగా ఇప్పుడు ఐటీ మంత్రిగా స్వయంగా రంగంలోకి దిగిన లోకేశ్… నేరుగా టెస్లా కార్యాలయానికే వెళ్లి, ఆసంస్థ ప్రతినిధులతో చర్చలు జరపడం గమనార్హం. అనంతపురంలో టెస్లా కార్ల తయారీ యూనిట్ తో పాటు ఈవీ వాహనాల బ్యాటరీల తయారీకి అనుకూల పరిస్థితులున్నాయని, అంతేకాకుండా ఏపీకి టెస్లా వస్తే… ఈవీ రంగంలో కొత్తగా చేపట్టబోయే ప్రతి అంశంలోనూ ఆ కంపెనీ కీలక భూమిక పోషించే అవకాశం ఉందని లోకేశ్ తెలిపారు.