టీజీ వెంకటేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. కాంగ్రెస్ లో కొనసాగుతున్న సమయంలోనే సమైక్యాంధ్ర కోసం గట్టిగా కృషి చేసిన నేత. విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ నుంచి తెదేపా గూటికి చేరారు. ఆ సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ రాజ్య సభలో తన గళాన్ని గట్టిగా వినిపించిన నేత. కొన్ని సార్లు తెదేపా అయినా ప్రత్యేక హోదా గురించి మరిచిపోయి మరో అంశం గురించి మాట్లాడి ఉండవచ్చు కానీ వెంకటేశ్ మాత్రం తెదేపాలో ఉన్నంత కాలం తన గళాన్ని గట్టిగానే వినిపించారు. ప్రస్తుతం టీజీ భాజపా తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.
పార్టీ మారిన తరువాత ఆయన స్వరం మారినట్లు అనిపిస్తుంది. ఏడాది క్రితం టీజీ తెదేపాను విడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర నాయకులపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకులు కొందరు నోరు జారుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. జగన్ ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తుంది. అలాగే కేంద్రం కూడా రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తుంది.
పార్టీ మారేటప్పటికీ స్వరం కూడా మారిందా?
టీజీ వెంకటేశ్ పార్టీ మారే సరికి ఆయన స్వరాన్ని కూడా మార్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది. తెదేపాలో ఉండగా ప్రత్యేక హోదా కోసం పోరాడిన టీజీ.. పార్టీ మారేసరికి.. ప్రత్యేక హోదాను ఒక బూచిలా చూపిస్తున్నారంటూ ఒక్కసారిగా తన గళాన్ని వినిపించారు. వైకాపా కూడా తెదేపాలానే వ్యవహరిస్తుందంటూ ఒక్కసారిగా బాంబు పేల్చారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి నిధులిస్తున్నప్పటికీ రాష్ట్రం ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా జరిగే పని కాదు
నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కావాలని గొంతెత్తిన టీజీ ఇప్పుడు ప్రత్యేక హోదా జరిగే పని కాదు అంటున్నారు. ప్యాకేజీ నిధులన్న తీసుకుని రాయలసీమ ఉత్తరాంధ్రను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్నారు. రూ.18 వేల కోట్లను తీసుకుని రాయలసీమ వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భూములను చూస్తుంటే థార్ ఎడారి లా అనిపిస్తున్నాయి.
కృష్ణ మిగులు జలాలు రాయలసీమ తీసుకుంటే తప్పేంటి?
కృష్ణ మిగులు జలాలను రాయలసీమ తీసుకుంటే తప్పేంటని ఆయన అన్నారు. తెలంగాణ అయితే మిగులు జలాలు వాడుకోవచ్చు కానీ రాయలసీమ వాడుకుంటే తప్పా?. పోనీ జగన్ కేసీఆర్ ను పిలిచి పార్టీ ఇస్తే అయిన ఆయన మనసు మారుతుందేమో అప్పుడే మిగులు జలాలను రాయలసీమకు అందిస్తారేమో అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేసీఆర్ వాదన పనికి వస్తుంది కానీ రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. కేసీఆర్ రాయలసీమకు సహకరించాలి. శ్రీశైలం నుంచి నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలి.
మూడు రాజధానులు ఇప్పట్లో జరిగే అంశం కాదు
మూడు రాజధానులు ఇప్పట్లో జరిగే అంశం కాదు. దేశంలో అనేక రాష్ట్రాల్లో సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్స్ ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమకు సమ్మర్, వింటర్ క్యాపిటల్స్ ను ఏర్పాటు చేయండి. కంప్యూటర్ పరిజ్ఞానం తో ఎక్కడి నుంచైనా పాలనను సాగించవచ్చు. మూడు ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నడపండి. రాయలసీమలో హై కోర్టు బెంచ్ , మినీ సచివాలయం ఏర్పాటు చేయండి. రాష్ట్ర నేతలు కొందరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను పక్కన పెడుతున్నారు.
కొవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొవాలి
కొవిడ్ ప్రభావం మరో ఏడాదిన్నర వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కొవిడ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం రాష్ట్రాలకు సహకరిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసే పనులు చాలా ఉన్నాయి.