ప్రైవేటీకరణ అంశంలో మాటతప్పం .. మడం తిప్పం!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట తప్పడం లేదు.. మడం తిప్పడం లేదని సోమవారం పార్లమెంట్ లో కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పున:పరిశీలించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. ఏపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రైవేటీకరణ వల్ల పెట్టుబడులు వస్తాయని, దీనివల్ల విస్తరణకు మరింత అవకాశం ఉంటుందని పార్లమెంట్ సాక్షిగా ఆయన స్పష్టం చేశారు. దీనినిబట్టి ఏపీకి ప్రత్యేక హోదా హామీ వలె ప్రైవేటీకరణ కూడా గతించిన అధ్యాయంలా భావించాల్సిందే అన్నది సుస్పష్టం! ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి .. నమ్మించి నట్టేట్లో ముంచారు. ఉన్న ఒకేఒక సెంటిమెంట్ ఉక్కు కర్మాగారాన్ని ఇలా కార్పోరేట్ పరం చేస్తుంటే.. చేతులు కట్టుకుని చూస్తున్న అధికార వైసీపీ ఎంపీలు, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ఏమనాలి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకుంది. ప్రైవేటీకరణ అంశంపై రాజీపడే ప్రసక్తే లేదని చెప్పింది. ముగ్గురు ఎంపీలతో పార్లమెంట్ లో పోరాడుతునే ఉన్నారు. మరో వైపు జనసేన ప్రైవేటీకరణను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగానే వ్యతిరేకిస్తోంది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ ఉద్యమాన్ని కూడా నిర్వహించింది.
జనసేన డిజిటల్ ఉద్యమానికి విశేష స్పందన..!
విశాఖ ఉక్కు పరిరక్షణకై ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. గత మూడు రోజులుగా ఏపీ వ్యాప్తంగా జనసైనికులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగు వారిందరి భావోద్వేగాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది ఈ – క్యాంపెయినింగ్ ఉద్యమం. మూడు రోజులు నుంచి సాగిన ఈ డిజిట్ ఉద్యమ ప్రచారానికి 697.4 మిలియన్ల మంది స్పందించారు. ఈ డిజిటల్ క్యాంపెయింన్ లో ఆంధ్రా ఎంపీలను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ‘సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్’ పేరుతో నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీల స్టాండ్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ఏపీ ఎంపీలు పార్లమెంట్ లో గట్టిగా పోరాడడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తీసుకురాలేక పోతున్నారని, జగన్ సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎంపీలను కనీసం పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకొని నిరసన తెలియజేసేలా సూచనలు చేయాలని డిమాండ్ చేశారు.











