కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత వైసీపీ హయాంలో ఈ ప్రాంతం కేవలం భూ దోపిడీలు, అక్రమాలు, కుంభకోణాలకే కేంద్ర బిందువుగా మారిందనే విమర్శలు తీవ్రస్థాయిలో వచ్చాయి. అప్పట్లో ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి కీలక నేతలు ఇష్టానుసారంగా భూ ఆక్రమణలకు, కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా సెటిల్మెంట్లు తప్ప అభివృద్ధి జాడే లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
కానీ, ఇవాళ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.జగన్ హయాంలో విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్రలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం విశాఖను నిజమైన ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇవాళ విశాఖలో ప్రతిష్టాత్మకంగా ఏకంగా 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతోంది. గత పాలకుల కాలంలో భూములు కబ్జాకు గురికాగా, నేడు వేలాది మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు దక్కుతుండటం విశేషం.
మరోవైపు, ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతీకగా నిలిచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో విశాఖకు పెద్ద ఎత్తున ప్రముఖ ఐటీ కంపెనీలు, అత్యాధునిక డేటా సెంటర్లు తరలివస్తున్నాయి. గతంలో అక్రమాలు, వివాదాలతో అప్రతిష్టపాలైన ఈ ప్రాంతం ఇవాళ పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సంక్షేమ ఫలాలతో ముందుకు వెళ్తోంది.
గత ఐదేళ్ల రాచరిక దోపిడీకి, ప్రస్తుత ప్రజా సంక్షేమ అభివృద్ధికి మధ్య ఉన్న తేడాను ఉత్తరాంధ్ర ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని పక్కనబెట్టి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో విశాఖను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరిన్ని కీలక ప్రాజెక్టులను తీసుకురానుంది.











