స్టార్ అంటే సినిమా రంగాన్ని వెలుగులతో ముంచెత్తాలి. అప్పుడే వారు కూడా వెలిగిపోతారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానమే వస్తుంది. ఏడాదికో రెండేళ్లకో ఒకటో రెండో సినిమాలు చేస్తే చిత్ర పరిశ్రమ ఏం వెలుగుతుంది. ఇప్పుడు కనుమరుగైపోయిన ఆ అయిదుగురు తారలు చేసిన సినిమాలు చూస్తే వారు జగజ్జేగేయమానంగా వెలిగిపోవడమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమను అగ్రపీఠం మీద నిలబెట్టింది వీరేనని కూడా తెలుస్తుంది. వీరిలో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. మహానటులు నందమూరి తారక రామారావు తన 44 ఏళ్ల సినీ కెరీర్ లో 300 సినిమాలు చేయగా, అక్కినేని నాగేశ్వరరావు 72 ఏళ్ల కెరీర్ లో 255 సినిమాలు చేశారు.
ఆ తర్వాతి శకం కృష్ణ, శోభన్ బాబులది. కృష్ణ 50 ఏళ్ల సినిమా కెరీర్ లో 350 సినిమాలు చేయగా, శోభన్ బాబు 37 ఏళ్ల కెరీర్ లో 230 సినిమాలు చేశారు. ఇక ఈ నలుగురి తర్వాత ఐదో హీరోగా ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు. ఆయన 55 ఏళ్లలో 190 సినిమాలు చేశారు. ఈ అయిదుగురూ కలిసి 1325 సినిమాలు చేయడం విశేషం. ఈ రికార్డు వేరెవరికీ సాధ్యం కాదు కూడా. రెండు మూడు షిప్టులు పనిచేస్తూ గడిపిన నటులు వీరు. పైగా మూస పద్దతిలో మాస్ సినిమాలు చేయడం కాకుండా సాంఘికం, పౌరాణికం, జానపదం,కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ, యాక్షన్, హారర్.. ఇలా అన్ని రకాల సినిమాలు చేయడం మరో రికార్డు. స్టార్ గా ఎంతో ఎత్తు ఎదిగినా డీగ్లామర్ పాత్రలు కూడా చేశారు. నటులుగా తామేంటో ప్రూవ్ చేసుకోవడం కోసం పరితపించారు. అందుకే పాత బంగారం ఎప్పటికీ పాత బంగారమే. ఆనాటి ఆ వైభవమే వేరు. అభిమానుల మధ్య పోటీ ఉన్నా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా వెనకాడలేదు.
సినిమా టిక్కెట్ల కోసం ముష్టియుద్దాలు జరిగిన రోజులవి. కొత్త సినిమా విడుదలైతే అది ఓ పెద్ద పండగే. థియేటర్ల ముందు ఎంత పెద్ద కటౌట్ ఉంటే ఆ హీరోకి అంత గొప్ప. ఇక బ్లాక్ టిక్కెట్ల వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలే. శతదినోత్సవాలు, సిల్వర్ జూబిలీలు, ప్లాటినం జూబిలీలు… ఇలా ఒక్కటేమిటి.. ఆ రోజులు ఏమైపోయాయో. ఆ శకం ఇక ముగిసిపోయింది. ఆ వైభవానికి శుభం కార్డు పడింది. ప్రతి తెలుగు సినీ అభిమానీ ఈ అయిదుగురికీ నివాళిగా ఒక్క కన్నీటిబొట్టు రాల్చాల్సిన సమయం ఇది. అందరినీ గుర్తుతెచ్చుకుని గుండెల్లోని అభిమానాన్ని పెదాలమీదికి తెచ్చుకుని హాయిగా ఓ చిరునవ్వు నవ్వాల్సిన సమయమిది. నేటి తరం హీరోలు వీరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. సినిమాని పాన్ ఇండియా సినిమా ఎదిగేలా చేయడమే కాదు ఏడాదికి కనీసం నాలుగు సినిమాలైనా చేయగలిగితే పూర్వ వైభవం సాధించడం ఎంతో సేపు పట్టదు. అప్పుడే ఈ అయిదుగురికీ అసలైన నివాళి.