టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ నిజంగానే సంచలన విజయాన్ని సాధించారు. కేంద్రం నిధులతో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి టీడీపీ హయాంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకుండా జగన్ సర్కారు తనదైన శైలి మొండి వైఖరితో సాగుతున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేతగా కాకుండా సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఈ బిల్లుల విడుదల కోసం పోరు మొదలెట్టిన సంగతి తెలిసిందే. రాజేంద్రప్రసాద్ ఎక్కడా రాజకీయాలను ప్రస్తావించకున్నా.. జగన్ పార్టీ మాత్రం ఆయనను సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడిగా కాకుండా టీడీపీ నేతగా, ఆ పార్టీ ఎమ్మెల్సీగానే చూసింది. దీంతో బిల్లుల మంజూరుపై ససేమిరా అనేసింది. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్ తన పోరును వదిలేయకుండా పట్టు వదలని విక్రమార్కుడికి మల్లే ఉపాధి పనుల పెండింగ్ బిల్లుల విడుదల కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ ఆశ్రయించారు. కేంద్రానికి లేఖలు రాశారు. జగన్ సర్కారుకూ లేఖలు రాశారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయినా జగన్ సర్కారు కనికరించలేదు. ఇలా లాభం లేదనుకున్న రాజేంద్రప్రసాద్ నేరుగా ఏపీ హైకోర్టు తలుపు తట్టారు. రాజేంద్రప్రసాద్ పిటిషన్ తో పాటు దాదాపుగా 2 వేల మంది కూడా ఈ బిల్లుల కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో జగన్ సర్కారుపై బాబూ రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారని చెప్పక తప్పదు.
హైకోర్టు తీర్పు ఇదే
ఉపాధి హామీ పనులు చేసిన వారికి బిల్లులను తక్షణమే చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఈ బిల్లుల చెల్లింపు ముగియాలని కూడా విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఇక్కడే ఓ ట్రిక్ ప్లే చేయబోయిన జగన్ సర్కారు తీరుపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. పెండింగ్ బిల్లులను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని సంచలన తీర్పు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, బిల్లులను 20 శాతం మేర తగ్గించి చెల్లించేందుకు అనుమతించాలని ప్రభుత్వం కోరగా.. అందుకు హైకోర్టు ససేమిరా అన్నది. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంటే.. ఉపాధి పనులను సొంత నిధులతో చేయించిన వారు నష్టపోవాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు అసలుకు వడ్డీని జమ చేసి చెల్లించాలని చెప్పింది. ఈ వడ్డీని కూడా పనులు చేసినప్పటి నుంచి 12 శాతం వడ్డీతో చెల్లించాలని కూడా కోర్టు తేల్చి చెప్పింది. 12 శాతం వడ్డీతో కలిపి బకాయిలను నాలుగు వారాల్లోనూ పూర్తిగా చెల్లించాలని హైకోర్టు చెప్పడంతో జగన్ సర్కారుకు డబుల్ షాక్ తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సర్పంచ్‌ల కష్టాలు చూసి..
జగన్ సర్కారు అధికారంలోకి వచ్చేనాటికి బాబూ రాజేంద్రప్రసాద్ టీడీపీ తరఫున శాదసన మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. అప్పటికే సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఆయన వద్దకు ఉపాధి పనులు చేసిన సర్పంచ్‌లు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు తన సొంత జిల్లా కృష్ణాతో పాటు పలు జిల్లాల్లోనూ పర్యటనలు సాగించిన రాజేంద్రప్రసాద్.. ఉపాధి హామీ పనులు చేసిన సర్పంచ్‌లు ఇతరత్రా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కళ్లారా చూశారు. కొందరైతే అప్పులు చేసి మరీ పనులు చేసి ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక పడుతున్న ఇబ్బందులనూ ఆయన చూశారు. దీంతో వెనువెంటనే కార్యరంగంలోకి దిగిపోయిన రాజేంద్రప్రసాద్.. ఉపాధి పనుల పెండింగ్ బిల్లుల కోసం ఉద్యమం ప్రారంభించారు. అన్ని రకాల ఉద్యమాలు చేపట్టిన రాజేంద్రప్రసాద్ చివరికి హైకోర్టును ఆశ్రయించి జగన్ సర్కారుకు డబుల్ షాక్ ఇప్పించారు. రాజేంద్రప్రసాద్ సాగించిన ఈ పోరు.. భవిష్యత్తులో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలవనుందన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- డాడీ.. వీళ్లేం పాపం చేశారు?