ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన పెచ్చులు మీరుతోంది. ప్రతిపక్ష నాయకులే టార్గెట్ గా అధికారులను అడ్డుపెట్టుకుని వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. నిన్నటి వరకు నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేసిన జగన్ సర్కార్.. నేడు వారి ఇళ్ళ కూల్చివేతలకు తెరలేపింది.చట్ట ప్రకారం నాడుచుకోవాల్సిన అధికారులు సైతం అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తరచుగా విమర్శలు చేస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిపై అధికారులు జేసీబీతో విరుచుకుపడ్డారు.ఈ క్రమంలో నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సీపట్నం మునిసిపాలిటీ శివపురం రెవెన్యూ పరిధిలోని 276 సర్వే నెంబర్‌లో జల వనరుల శాఖకు చెందిన రావణాపల్లి రిజర్వాయర్ పంట కాలువ గట్టుకు చెందిన రెండు సెంట్ల మేర భూమిని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారనే అభియోగంపై అయ్యన్నపాత్రుడు ఇంటి వెనుక ఉన్న ప్రహరీని కూల్చేశారు.అదేవిధంగా వంట గదిని కూలగొట్టేందుకు అధికారులు సిద్ధం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. దీంతో అధికారులకు , అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన ఆదివారం తెల్లవారుఝామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు, మునిసిపల్ కమిషనర్ కనకారావు, ఆర్డీఓ గోవిందరావు వంద మందికి పైగా పోలీసులతో అయ్యన్న ఇంటిని చుట్టుముట్టి శివపురం పరిసరాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయించి ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున అయ్యన్నపాత్రుడి ఇంటికి చేరుకుని గోడ కూల్చివేతను తీవ్రంగా ప్రతిఘటించడంతో జేసీబీ డ్రైవర్ పరారయ్యాడు. ఆర్డీఓ గోవిందరావు, నర్సీపట్నం కమిషనర్ కనకారావులు మరొక డ్రైవర్ కోసం ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో కూల్చివేత నిలిపేశారు.
వాస్తవానికి ఇటువంటి కూల్చివేతలు చేసే సమయంలో అధికారులు ముందుగా నోటీసులు ఇవ్వాలి.కానీ తమకు ఎటువంటి నోటీసులు అందలేదని అయ్యన్న కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే విషయం పై అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి, రెండో కుమారుడు రాజేశ్ అధికారులను నిలదీశారు. ఇక కూల్చివేత పై న్యాయస్థానంలో తేల్చుకుంటామని అయ్యన్న కుమారుడు విజయ్ అన్నారు. ఇంటి నిర్మాణానికి అన్ని హక్కు పత్రాలు ఉన్నాయని..ఇంటి నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చేసిన ఏఎస్పీ, ఆర్డీఓ, ఎమ్మార్వోలపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. జరిగిన నష్టాన్ని అధికారుల జేబు నుంచి చెల్లించేలా చేస్తామన్నారు. 40 ఏళ్లుగా నిజాయితీగా బతికిన ఒక మాజీ మంత్రినే ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే అయ్యన్న ఇంటి కూల్చివేత పధకం ప్రకారమే చేసినట్లుగా కనిపిస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచే వందలాది మంది పోలీసులు, విశాఖపట్నం నుంచి రిజర్వు పోలీసు బలగాలు, అనకాపల్లి పోలీసులు అయ్యన్నపాత్రుడు ఇంటి వద్దకు చేరుకున్నారు. కూల్చివేత విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వివిధ మండలాల నుంచి పెద్దఎత్తున అయ్యన్నఇంటి వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నర్సీపట్నం నుంచి అయ్యన్న ఇంటికి వెళ్లేందుకు ఉన్న రెండు మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ వెళ్ళకుండా ఆంక్షలు విధించే ప్రయత్నం చేశారు.కాగా, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో చేసేదేమీలేక కొద్దిసేపటి తర్వాత పోలీసులు వారిని అనుమతించారు.
మరోవైపు ఆర్డీఓ గోవిందరావు, మునిసిపల్ కమిషనర్ కనకారావులు ఆదివారం మధ్యాహ్నం మండల సర్వేయర్ ద్వారా అయ్యన్న ఇంటి గోడ నిర్మించిన ప్రదేశంలో సర్వే చేయించేందుకు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ, స్థానిక నేతలు అభ్యంతరం చెప్పారు. టౌన్‌ప్లానింగ్ నుంచి బ్లూ ప్రింట్ తెచ్చిన తర్వాత ఒకరోజు గడువు ఇచ్చి సర్వే చేయాలని అధికారులను కోరారు. ఈ విషయమై అధికారులు, టీడీపీ నేతల మధ్య చాలాసేపు చర్చలు సాగాయి. చివరకు టీడీపీ నేతల ప్రతిపాదనకు అధికారులు అంగీకరించి సోమవారం ఉదయం సర్వే చేయాలని నిర్ణయించారు.